NIA Raids: ఎన్‌ఐఏ అధికారులు సోదాలకొస్తే.. 6 గంటలు డోర్‌ తీయలేదు..!

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల సోదాలకు సహకరించకుండా ఓ వ్యక్తి మొండిగా ప్రవర్తించాడు. ఇంటి తలుపు తీయకపోవడంతో అధికారులు ఆరు గంటలకు పైగా గుమ్మం వద్దే ఎదురుచూడాల్సి వచ్చింది. ముంబయి (Mumbai)లో చోటుచేసుకుందీ ఘటన. అసలేం జరిగిందంటే..?

Published : 11 Oct 2023 16:43 IST

ముంబయి: గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్‌ పర్యటనకు బెదిరింపులు వచ్చాయి. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే బుధవారం ఆరు రాష్ట్రాల్లో నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI)కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముంబయి (Mumbai)లో అబ్దుల్‌ వాహిద్‌ షేక్‌ ఇంటికి ఎన్ఐఏ బృందం తనిఖీలకు వెళ్లగా.. సోదాలకు సహకరించకుండా అతడు హంగామా చేశాడు.

‘‘ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో విఖ్రోలిలోని అబ్దుల్ వాహిద్‌ షేక్‌ నివాసానికి ఎన్‌ఐఏ బృందం.. ముంబయి పోలీసులతో కలిసి సోదాల (NIA Raids)కు వెళ్లింది. కానీ, అతడు ఇంటి తలుపు తీసేందుకు నిరాకరించాడు. సెర్చ్‌ వారెంట్‌ కావాలంటూ లోపలి నుంచే డిమాండ్‌ చేశాడు. దాదాపు ఆరు గంటల తర్వాత అతడి లాయర్‌, ఇతర సామాజిక కార్యకర్తలు వచ్చిన తర్వాత ఉదయం 11.15 గంటల ప్రాంతంలో అతడు డోర్‌ తెరిచాడు’’ అని ఎన్‌ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.

దిల్లీలో మాయమైన క్రిప్టో.. హమాస్‌ దగ్గర తేలి..!

అనంతరం వాహిద్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు, ఎన్‌ఐఏ అధికారులు వచ్చిన సమయంలో వాహిద్‌ తన వాట్సాప్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ఎలాంటి పత్రాలు లేకుండా తన ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలకు వచ్చిందని ఆరోపించాడు. ఆ వీడియో చూసి అక్కడకు పెద్ద ఎత్తున హక్కుల కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అతడి నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

7/11 ముంబయి రైలు పేలుళ్ల ఘటనలో వాహిద్ షేక్‌ను నిందితుడిగా పేర్కొనగా.. ఆ తర్వాత కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. 2006 జులై 11వ తేదీన ముంబయిలోని పలు లోకల్‌ రైళ్లలో 15 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని