Maratha reservation: స్తంభించిన ‘బీడ్‌’.. పోలీసు ఆంక్షలు.. ఇంటర్నెట్‌ కట్‌

మహారాష్ట్రలోని బీడ్‌ నగరంలో సోమవారం చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు.

Published : 31 Oct 2023 17:13 IST

బీడ్‌: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు (Maratha Reservations) కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని (Maharashtra) బీడ్‌ నగర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు. రవాణా వ్యవస్థలను, అంతర్జాల సేవలను నిలిపివేశారు. బీడ్‌లోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకే నివాసంపై సోమవారం నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇల్లు మొత్తం దగ్ధమైంది. మంగళవారం ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే  పోలీసులు పటిష్ఠ చర్యలు ప్రారంభించారు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కచ్చితమైన కారణం చూపకుండా బయటకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి.. అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.

భగ్గుమన్న ‘మరాఠా కోటా’ ఆందోళనలు.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు!

మరోవైపు బీడ్‌ నగరంలోని బస్‌ డిపోలో విరిగిపోయిన కిటికీలు, బస్సుల అద్దాలు, ధ్వంసమైన కంట్రోల్‌ క్యాబిన్‌ సోమవారం నాటి ఆందోళనల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. వందలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా బస్‌ డిపో లోపలికి చొరబడి విధ్వంసం సృష్టించారని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ‘‘ నిన్న సాయంత్రం దాదాపు వెయ్యి మంది ఆందోళనకారులు ఒక్కసారిగా బస్‌డిపో మీద విరుచుకుపడ్డారు. కనిపించిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. డిపోలో నిలిపి ఉంచిన 53 బస్సులను నామరూపాల్లేకుండా చేశారు.’’ అని రవాణాశాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. బస్సులకు నిప్పంటించేందుకు ప్రయత్నించినప్పటికీ.. రవాణా సిబ్బంది వారిని అడ్డుకున్నట్లు తెలిపారు.

బీడ్ నగరంలో జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశారు. 55 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆందోళనలతో సంబంధం ఉన్న మరో 300 మందిని గుర్తించి విచారిస్తున్నట్లు బీడ్‌ ఎస్పీ నందకుమార్‌ తెలిపారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహారాష్ట్రలో గత కొన్నాళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, రిజర్వేషన్లకు అనుకూలంగా మనోజ్‌ జరంగే చేపట్టిన నిరాహార దీక్షపై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే సోమవారం హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని