Ayodhya: అందుకే కొత్త విగ్రహం.. ఆలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లకుపైగా ఖర్చు!

అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. 

Updated : 21 Jan 2024 16:10 IST

అయోధ్య: రామ మందిర ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Consecration) అయోధ్య ముస్తాబైంది. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్‌ 2) చేపడుతోన్న మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు.

51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చిన విషయం తెలిసిందే. మొత్తం మూడింటిలో.. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. మిగతా రెండింటినీ ఆలయంలో ఉంచుతామని గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. ‘‘పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది. 25- 30 అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు. అందుకే పెద్ద మూర్తి అవసరమైంది’’ అని చెప్పారు.

మూడు అంతస్తులు, 392 స్తంభాలు.. అయోధ్య రామ మందిర విశేషాలివే!

‘‘మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. అవన్నీ అందంగా ఉన్నాయి. దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం, రాముడు ఆజానుబాహుడు కాబట్టి.. చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాలను పాటించాయి. మేం ఎంపిక చేసిన ప్రతిమ శరీర పుష్టి, మంచి వ్యక్తిత్వం కనబడేలా చక్కగా కుదిరింది. పిల్లవాడి సున్నిత స్వభావం దాని అందాన్ని పెంచింది. ఆభరణాలను సున్నితంగా చెక్కారు’’ అని ట్రస్టు కోశాధికారి వివరించారు. విగ్రహాలను చెక్కేందుకు నాలుగైదు నెలలు పట్టిందని, అనంతరం ఒకరోజు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని