
Omicron: ఒకటిన్నర- మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: విస్తృత వ్యాప్తితో ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 89 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తన తాజా అప్డేట్లో వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిన్నర- మూడు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. ‘హెర్డ్ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ఈ వైరస్‌కు రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం కారణంగా ఇలా జరుగుతోందా? లేదా వేగంగా వ్యాప్తి చెందగల స్వాభావిక లక్షణంతోనా? లేదా ఈ రెండింటి కలయిక ఇందుకు కారణమవుతోందా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది’ అని చెప్పింది.
మరింత సమాచారం అవసరం..
ఈ కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని గమనించిన డబ్ల్యూహెచ్‌వో.. నవంబరు చివరి వారంలో దీన్ని ‘ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా వర్గీకరించిన విషయం తెలిసిందే. అయితే.. దీని వ్యాప్తి వేగం, అనారోగ్య తీవ్రతపై పూర్తి డేటా ఇంకా అందుబాటులో లేదని తెలిపింది. వైరస్ తీవ్రతతోపాటు దీనిపై వ్యాక్సిన్లు, రోగనిరోధక శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం అవసరమని పేర్కొంది. టీకాల సామర్థ్యంపైనా ఇప్పటికీ పరిమిత వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పైగా సమగ్ర ఆధారాలు లేవని వెల్లడించింది.