Bjp MPs: ప్రధానిని చంపేందుకు కుట్ర పన్నారు: భాజపా ఎంపీలు

ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భారీ భద్రతా లోపాలపై పలువురు భాజపా ఎంపీలు శుక్రవారం పార్లమెంట్...

Published : 07 Jan 2022 20:21 IST

దిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతా లోపాలపై పలువురు భాజపా ఎంపీలు శుక్రవారం పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నిరసనలు చేపట్టారు. పంజాబ్‌ ప్రభుత్వం, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రధానిని చంపడానికి కుట్రపన్నారని ఎంపీలు ఆరోపించారు. పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై కేసు నమోదు చేయాలని నిరసనలో భాగంగా డిమాండ్‌ చేశారు. మేరఠ్‌ ఎంపీ రాజేంద్ర అగర్వాల్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భద్రత విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం కుట్ర ఉందని, భద్రత విషయంలో రాజీపడిందని ఆరోపించారు. ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు స్పందించక పోవడం దారుణమని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని క్షమాపణలు చెప్పాలని కోరారు. పంజాబ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చౌదరి డిమాండ్‌ చేశారు ప్రధాని మోదీపై దాడికి రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ కుట్రపన్నారని దక్షిణ దిల్లీకి చెందిన ఎంపీ రమేశ్‌ బిధూరీ అన్నారు. పంజాబ్‌ సీఎం చన్నీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మొబైల్‌ ఫోన్‌ సంభాషణలపై విచారణ జరపాలని బిధూరీ డిమాండ్‌ చేశారు. ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న భారీ భద్రతా లోపంపై హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎమ్‌హెచ్‌ఏ) పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణాత్మక నివేదిక కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని