Covid: దిల్లీలో ఆరు రెట్లు పెరిగిన ఐసోలేషన్‌ కేసులు

దేశ రాజధాని దిల్లీలో ఏప్రిల్‌ 11 నుంచి 24 తేదీల్లో కరోనా ఐసోలేషన్‌ కేసుల సంఖ్య ఆరు రెట్లు పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

Published : 26 Apr 2022 01:42 IST

క్రమంగా పెరుగుతోన్న కరోనా ఆర్‌-విలువ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా ఏప్రిల్‌ 11 నుంచి 24 తేదీల్లో ఈ ఐసోలేషన్‌ కేసుల సంఖ్య ఆరు రెట్లు పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ నమోదవుతోన్న కరోనా ఆర్‌-విలువ (రీప్రొడక్షన్‌ రేటు) అధికంగా నమోదుకావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

ఏప్రిల్‌ 11వ తేదీన దిల్లీలో హోం ఐసోలేషన్‌ కేసుల సంఖ్య 447గా ఉండగా, ఏప్రిల్‌ 13కు 504 పెరిగింది. అలా రోజువారీగా పెరుగుతూ వచ్చి ఏప్రిల్‌ 18 నాటికి వెయ్యికి చేరింది. ఇలా రెండు వారాలుగా ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం ఐసోలేషన్‌ కేసుల సంఖ్య 2వేలు దాటింది. ఇదే సమయంలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తొలుత 17 మంది కొవిడ్‌ బాధితులు ఆస్పత్రుల్లో ఉండగా.. ప్రస్తుతం 80 మంది కొవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, క్రియాశీల కేసులతో పోలిస్తే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రి చేరికలు తక్కువగానే ఉన్నట్లు దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

ఏప్రిల్‌ 11న 3975 క్రియాశీల కేసులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3975కు పెరిగింది. యాక్టివ్‌ కేసుల్లో పెరుగుదల ఉన్నప్పటికీ ఆస్పత్రి చేరికలు మాత్రం మూడు శాతం కంటే తక్కువగానే ఉన్నాయని దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా నగరంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరగడానికి ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతోన్న ఆర్‌-విలువ..

దిల్లీలో కరోనా విజృంభణ గణనీయంగా పెరుగుతోందని చెప్పడానికి అక్కడ నమోదవుతోన్న ఆర్‌-విలువ (R-Value) నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌ ఆర్‌-విలువ 2.1గా నమోదైనట్లు ఐఐటీ మద్రాస్‌ విశ్లేషణలో తేలింది. అనగా.. వైరస్‌ బారినపడిన ఒక వ్యక్తి నుంచి మరో ఇద్దరికి కరోనా సంక్రమిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, రాజధానిలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ ఎక్కువ మంది ఇదివరకే వైరస్‌ బారినపడి కోలుకోవడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని