
Jammu Kashmir: ‘పొరుగు దేశమే అతిపెద్ద శత్రువని నిరూపితమవుతోంది’
శ్రీనగర్: శ్రీనగర్- షార్జా మధ్య విమానాల రాకపోకలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో అవి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో పాక్ వైఖరి చూస్తుంటే కశ్మీర్‌వాసుల పాలిట ఆ దేశమే అతిపెద్ద శత్రువని నిరూపితమవుతోందని భాజపా జమ్మూ-కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆరోపించారు. దీంతోపాటు కశ్మీర్ ప్రజలకు అది ఎన్నటికీ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా ఉండదని చూపుతోందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసేయడం దురదృష్టకరం. వేల మంది కశ్మీరీ యువకులు యూఏఈ, సౌదీ అరేబియాలను సందర్శిస్తుంటారు. ఏటా లక్షలాది ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఇక్కడినుంచి షార్జాకు నేరుగా విమానాలను ప్రారంభించింది.
కానీ, పాకిస్థాన్ వైఖరితో.. ఇప్పుడవి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా పాక్ పనిని గమనిస్తున్నాయి. ఆ దేశం ప్రతిసారి కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించింది. విధ్వంసాలకు కారణమైంది. అయితే, మేం దాని ప్రయత్నాలను విఫలం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం.. ఈ విషయంలో పాక్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరింది. దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను లేవనెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విమానాలు నడుపుతున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలని కేంద్రం కోరినట్లు వెల్లడించాయి. అక్టోబరు 23న ఈ రూట్ ప్రారంభం కాగా, మొదట్లో నాలుగు విమానాలకు అనుమతి ఇచ్చిన పాక్ ప్రభుత్వం.. అక్టోబరు 30 తర్వాత నిరాకరించింది.