బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ

Wrestlers protest: తనకున్న మద్దతు చూపించుకునేందుకు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన బ్రిజ్‌భూషణ్‌కు అనుమతి రాలేదని తెలుస్తోంది. దాంతో ఆయన తన ర్యాలీని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. 

Updated : 02 Jun 2023 18:21 IST

లఖ్‌నవూ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌(Brij Bhushan Singh)కు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ వాయిదా పడింది. తనకున్న మద్దతును చూపించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నారు. కాగా, వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్‌ ఫేస్‌బుక్‌ ప్రకటన ద్వారా వెల్లడించారు. (wrestlers protest)

‘మీ మద్దతుతో గత 28 సంవత్సరాలుగా చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నాను. నేను అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అని వర్గాలను ఏకం చేసేందుకు నా వంతు కృషి చేశాను. ఆ వర్గాలకు చెందిన లక్షలాదిమంది నాకు మద్దతు తెలుపుతున్నారు. అందుకే నా రాజకీయ ప్రత్యర్థులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే జూన్ 5వ తేదీన సాధువుల ఆశీస్సులతో ‘జన చేతన్ మహార్యాలీ’ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజులపాటు దీనిని వాయిదా వేస్తున్నాను’అని తన ప్రకటనలో వెల్లడించారు. సోమవారం అయోధ్యలో ర్యాలీలో పాల్గొంటానని ఇదివరకు బ్రిజ్‌ భూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికి యూపీ(Uttar Pradesh) ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సమాచారం.

రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆయన్ను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. వారికి రైతు సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. వారికి మద్దతుగా కిసాన్ మోర్చా నిన్న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌పుర్‌లో గురువారం ఖాప్‌ పంచాయతీ జరిగింది. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతిని కలవాలని అందులో రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. తాజాగా హరియాణాలోని కురుక్షేత్ర అందుకు వేదికైంది.

ఈ ఆందోళనల నేపథ్యంలో రెజ్లర్ల అంశాన్ని జాగ్రత్తగా చూస్తున్నామని, వారు డిమాండు చేసినట్లుగా విచారణకు కమిటీని నియమించామని కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. వారి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని గురువారం ముంబయిలో చెప్పారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు