CoWIN data: కొవిన్‌ పోర్టల్‌ డేటా లీక్‌.. టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం!

CoWIN Data on telegram: దేశంలో డేటా లీక్‌ వెలుగుచూసింది. కొవిడ్‌ టీకా తీసుకున్న వ్యక్తుల డేటా టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమైంది.

Published : 12 Jun 2023 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో మేజర్‌ డేటా లీక్‌ వెలుగుచూసింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లోని (CoWIN portal) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఆధార్‌, పాన్‌ తదితర వివరాలు టెలిగ్రామ్‌లో (Telegram) ప్రత్యక్షమయ్యాయి. ఎవరైనా ఈ డేటాను యాక్సెస్‌ చేసే విధంగా అందుబాటులోకి రావడం కలకలం రేపుతోంది.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ (CoWIN) పేరిట ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఒకే ఫోన్‌ నంబర్‌తో కుటుంబంలోని పలువురు టీకాలు వేయించుకున్నారు కూడా. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్‌ వేసుకున్నారు? వంటి సమాచారం ఉంటుంది.

ఇంతటి కీలక సమాచారం మెసెంజర్‌ యాప్‌ టెలిగ్రామ్‌లో సోమవారం వెలుగుచూడడం కలకలం రేపింది. టెలిగ్రామ్‌లోని ఓ బాట్‌లో (bot) వ్యక్తుల ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే వారి సమస్త సమాచారం వెలుగుచూసింది. ఆధార్‌ వివరాలు ఎంటర్‌ చేసినా వివరాలు వచ్చాయి. విదేశాలకు వెళ్లేందుకు కొందరు కొవిన్‌ పోర్టల్‌లో పాస్‌పోర్ట్‌ వివరాలు కూడా అందించారు. అలాంటి వారి డేటా సైతం డేటా లీకేజీలో బయటకొచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్‌బాట్‌ నిలిచిపోయిందని తెలిసింది. అయితే.. సాధారణంగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయినప్పుడు.. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసినప్పుడు మాత్రమే ఈ సమాచారం కనిపిస్తుంది. అలాంటిది.. ఎలాంటి ఓటీపీలతో సంబంధం లేకుండా ఈ డేటా బయటకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

లీకైన డేటాలో ప్రముఖుల వివరాలు

లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ  కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఫోన్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే ఆయన పూర్తి వివరాలు వస్తున్నాయని ‘మలయాళ మనోరమ’ పేర్కొంది. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పి చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ వంటి నేతల వివరాలు బయటకొచ్చాయి. ఈ డేటా లీకేజీపై తృణమూల్‌ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంటూ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. సంబంధిత స్క్రీన్‌షాట్లను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని