Petrol Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపు.. కేంద్రం ప్రకటన

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Updated : 14 Mar 2024 22:37 IST

Petrol, Diesel Prices| దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అధిక ఇంధన ధరల(petrol price)తో అవస్థలు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్లు సమాచారం ఇచ్చాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్స్‌ వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. లీటర్‌ పెట్రోల్‌పై ₹2 తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.72; ముంబయిలో రూ.104.21; కోల్‌కతా రూ.103.94, చెన్నై రూ.100.75గా ఉండనున్నాయి.

సవరించిన ధరల ప్రకారం లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.87.62కాగా.. ముంబయిలో రూ.92.15; కోల్‌కతాలో రూ.90.76, చెన్నైలో 92.34చొప్పున ఉండనున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపుతో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఎల్లప్పుడూ కోట్లాది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని మరోసారి నిరూపించుకున్నారని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని