PM Modi: యూట్యూబ్‌లో ప్రధాని మోదీ హవా.. రెండు కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీకి ఉన్న విశేష ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో మరో మైలురాయిని అందుకున్నారు.

Published : 26 Dec 2023 22:19 IST

దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన దేశ నాయకుడిగా ఆయన ముందంజలో ఉన్నారు. తాజాగా ఆయన మరో మైలురాయిని అందుకున్నారు. యూట్యూబ్‌ (YouTube)లో ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) అధికారిక ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వారి సంఖ్య మంగళవారానికి రెండు కోట్లు దాటింది. ఇంతమంది సబ్‌స్క్రైబర్లు కలిగిన తొలి ప్రపంచస్థాయి నాయకుడు ప్రధాని మోదీ కావడం విశేషం. 2007లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఖాతా ప్రారంభించారు. 

ఈ ఛానల్‌లో తన ప్రసంగాలు, సభలు, వివిధ దేశాధినేతలతో కలిసి పాల్గొన్న సమావేశాలతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుంటారు. వీటిలో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషద (Fumio Kishida)తో కలిసి పానీపూరి (గోల్‌గప్ప) తిన్న వీడియోను అత్యధికంగా 12 కోట్ల మంది వీక్షించారు. తర్వాత వారణాశిలో దివ్యాంగులతో సంభాషిస్తున్న వీడియోను 10.5 కోట్ల మంది, చంద్రయాన్‌-2 విఫలమైన సందర్భంలో అప్పటి ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ను ప్రధాని మోదీ ఓదార్చిన వీడియోను 8.2 కోట్ల మంది వీక్షించారు. ఈ ఛానల్‌లో మొత్తం 23 వేల వీడియోలు ఉన్నాయి.

‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’

రెండు నెలల క్రితం యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 అనే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ యూట్యూబ్‌ ఛానెల్‌కు 1.79 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో 20 లక్షల మందికిపైగా ఈ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఇది ప్రధాని మోదీకి సామాజిక మాధ్యమాల్లో ఉన్న విశేష ఆదరణకు నిదర్శనం. ప్రస్తుతం ప్రధాని మోదీని ట్విటర్‌ (ఎక్స్‌)లో 9.4 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.8 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 8.27 కోట్ల మంది, వాట్సాప్‌ ఛానెల్‌లో 1.26 కోట్ల మంది అనుసరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని