PM Modi: బంగ్లా, మారిషస్‌ ప్రధానులతో భేటీపై మోదీ ట్వీట్‌

దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు విచ్చేసిన బంగ్లాదేశ్‌, మారిషస్‌ ప్రధానులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగినట్టు ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 08 Sep 2023 19:51 IST

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 summit)కు దిల్లీ (Delhi) నగరం సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే సభ్య దేశాలకు చెందిన నేతలు, ప్రతినిధులు దిల్లీ చేరుకొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం కొద్ది సేపటి క్రితమే దిల్లీలో ల్యాండ్‌ అయ్యారు. మరోవైపు సదస్సులో భాగంగా భారత్‌కు విచ్చేసిన పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. తమ మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని ట్వీట్‌ చేశారు. గత తొమ్మిదేళ్లలో భారత్‌- బంగ్లాదేశ్  సంబంధాలు ఎంతగానో వృద్ధి చెందాయన్నారు. కనెక్టివిటీ, వాణిజ్య సంబంధ, తదితర అనేక అంశాలపై హసీనాతో చర్చించినట్టు మోదీ పేర్కొన్నారు.

దిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

అలాగే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌తో మోదీ సమావేశమయ్యారు. తమ మధ్య సమావేశం చాలా బాగా జరిగిందని ట్వీట్‌ చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయినందున ఇది భారత్‌-మారిషస్ సంబంధాలకు ప్రత్యేక సంవత్సరమని పేర్కొన్నారు. మౌలిక వసతులు, ఫిన్‌టెక్, సంస్కృతి, తదితర రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు.

కాసేపట్లో బైడెన్‌తో కీలక భేటీ..

కొద్దిసేపటి క్రితమే భారత్‌కు చేరుకున్న జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు. జీఈ, జెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్‌, క్లిష్టమైన, అధునాతన సాంకేతికత అభివృద్ధికి పరస్పర సహకారం, అణు రంగంలో పురోగతి తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని