Joe Biden: దిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 

Updated : 08 Sep 2023 19:47 IST

దిల్లీ: జీ20 (G20 Summit) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) దిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ (VK Singh) ఆయనకు స్వాగతం పలికారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. జో బైడెన్‌ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీతో భేటీ కానున్నారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించనున్నారు.

జేఈ జెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్‌, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇద్దరు నేతలు కూలంకషంగా చర్చించనున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ ఇదివరకే మీడియాకు వెల్లడించారు. ద్వైపాక్షిక భేటీ పూర్తయిన తర్వాత  ఐటీసీ మౌర్యాలో జో బైడెన్‌ బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లను ఇప్పటికే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ హోటల్‌ 14 వ అంతస్తులో బైడెన్‌ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్‌ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ హోటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్‌ చేశారు.

జో బైడెన్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ (Jill Biden) ఇటీవల కొవిడ్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత్‌ పర్యటనకు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం బైడెన్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా వైరస్‌ నెగెటివ్‌గా తేలింది. మంగళవారం మరోసారి టెస్టులు చేయగా.. మళ్లీ నెగెటివ్‌గానే నిర్ధారణ అయ్యింది. దీంతో బైడెన్ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్వేతసౌధం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌లో జరిగే జీ-20 సదస్సుకు బైడెన్‌ హాజరవుతారని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని