Deep fake: డీప్‌ఫేక్ కలవరం.. ఆ దృశ్యాలను నమ్మేముందు జాగ్రత్త: మోదీ

Deep fake: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న డీప్‌ఫేక్‌ (DeepFake) దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై మోదీ(Modi) మరోసారి స్పందించారు. 

Updated : 20 Dec 2023 10:41 IST

దిల్లీ: సరికొత్త సాంకేతికతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ(Modi) మరోసారి ప్రజలను హెచ్చరించారు. ఇటీవలకాలంలో వెలుగుచూస్తున్న డీప్‌ఫేక్(Deep fake) వీడియోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’ ముగింపు కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులతో మాట్లాడారు.

‘అత్యాధునిక సాంకేతికతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాటిని జాగ్రత్తగా వాడితే.. అవి మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఆ సాంకేతికతలను దుర్వినియోగం చేస్తే.. ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కృత్రిమ మేధతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ వీడియోలు, ఫొటోలను నిజమని నమ్మేముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది’ అని మోదీ వెల్లడించారు.

డీప్‌ఫేక్‌.. గుడ్‌.. బ్యాడ్‌.. అగ్లీ!

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన డీప్‌ఫేక్‌ (DeepFake) ఫొటోలు, వీడియోలు సినీతారలు, సెలబ్రిటీలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో మోదీ(Modi) స్పందిస్తూ.. ‘డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్‌ అయ్యింది. తెలిసినవాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్‌ చేశారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియోలపై ప్రజలకు మీడియా, జర్నలిస్టులు.. తప్పనిసరిగా అవగాహన కల్పించాలి’ అని అన్నారు.

డీప్‌ఫేక్‌(DeepFake)పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లను నియంత్రించేందుకు ఇటీవల సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ నకిలీ వీడియోల వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని