Bhagwant Mann: వైద్యురాలిని పెళ్లాడిన పంజాబ్‌ సీఎం.. ఇంట్లోనే నిరాడంబరంగా వివాహం

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. ఎలాంటి బాజా భజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా

Updated : 07 Jul 2022 16:28 IST

హాజరైన కేజ్రీవాల్‌, రాఘవ్‌ చద్దా

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లాడారు. ఎటువంటి బాజా భజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా చండీగఢ్‌లోని సెక్టార్‌ 2లో గల సీఎం నివాసంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం మాన్‌.. కౌర్‌ను పెళ్లి చేసుకొన్నారు. ఈ వేడుకకు మాన్‌ తల్లి, సోదరి, అతి కొద్ది మంది కుటుంబ సభ్యులతో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా హాజరయ్యారు.

పెళ్లి వేడుకకు సంబంధించి కొన్ని ఫొటోలను ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ పంజాబ్‌ సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోల్లో భగవంత్‌ మాన్‌ బంగారు వర్ణం కుర్తా ధరించగా.. గురుప్రీత్‌ కౌర్‌ ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోయారు. ముహూర్తానికి ముందు కౌర్‌ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. నీలం రంగు కుర్తీలో ఉన్న తన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘పెళ్లి రోజు వచ్చేసింది’’ అని గురుప్రీత్‌ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ఆప్‌ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

హరియాణాలోని పిహోవా ప్రాంతానికి చెందిన గురుప్రీత్‌ కౌర్‌.. మౌలానా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఇటీవలి పంజాబ్‌ ఎన్నికల సమయంలోనూ ప్రచారంలో ఈమె మాన్‌కు సహకరించారు. కాగా.. మాన్‌కు ఇది రెండో వివాహం. అంతకుముందు ఆయన ఇంద్రప్రీత్‌ కౌర్‌ను వివాహం చేసుకోగా.. ఆరేళ్ల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. మార్చి 16న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారం చేసినపుడు ఆ వేడుకకు పిల్లలు సీరత్‌ (21), దిల్షాన్‌ (17) ఇద్దరూ హాజరయ్యారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు