Raksha Bandhan : అక్క సోదర వాత్సల్యం.. తమ్ముడికి రాఖీ కట్టి మరీ కిడ్నీ దానానికి సిద్ధమైంది!

రక్షాబంధన్‌ (Raksha Bandhan) రోజున ఓ అక్క.. తన తమ్ముడికి కిడ్నీ దానం చేయనున్నట్లు ప్రకటించింది. 

Updated : 22 Feb 2024 14:36 IST

రాయ్‌పుర్ : రక్షాబంధన్‌ (Raksha Bandhan) సందర్భంగా ఓ అక్క కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న తన తమ్ముడికి రాఖీ కట్టింది. అంతే కాదు.. అతడు కోలుకునేందుకు తన వంతుగా కిడ్నీ దానం చేస్తున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పుర్‌ నగరానికి చెందిన ఓం ప్రకాశ్ ధన్‌గర్‌కు గతేడాది మేలో కిడ్నీ దెబ్బతినింది. దాంతో తరచూ డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక కిడ్నీ 80%, మరో కిడ్నీ 90% దాకా క్షీణించినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని ఆయనకు సూచించారు. లేని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. 

విషాదం.. గుండెపోటుతో అన్న మృతి.. మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

దాంతో ఓం ప్రకాశ్‌ కుటుంబ సభ్యులు గుజరాత్‌ రాష్ట్రం నడియాడ్‌లోని ఓ ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యులు సైతం కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఎవరైనా దాతలు ఉంటే ఆపరేషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ విషయం ఓం ప్రకాశ్‌.. అక్క సుశీలాబాయ్‌ పటేల్‌ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన తమ్ముడికి కిడ్నీ దానం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. అనంతరం దాత కిడ్నీ.. మార్పిడికి సరిపోతుందని నిర్ధారించారు. 

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 3న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరగబోతోంది. ప్రస్తుతం సుశీలాబాయ్‌, ఓం ప్రకాశ్‌ గుజరాత్‌లోని ఆస్పత్రిలో ఉన్నారు. నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సుశీల తన సోదరుడికి రాఖీ కట్టి.. నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని దీవించింది. తమ్ముడు ఓం ప్రకాశ్‌ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. అందుకే కిడ్నీ దానానికి సిద్ధపడ్డానని సుశీల తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని