‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్‌ పొలిటికల్ స్టంట్‌’: అశోక్‌ చవాన్‌

ఇటీవల కాంగ్రెస్‌(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. 

Published : 18 Mar 2024 14:53 IST

ముంబయి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించిన సీనియర్ లీడర్ని తాను కాదని భాజపా నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ (Ashok Chavan) అన్నారు. రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీతో భేటీ కాలేదని స్పష్టం చేశారు.

ఆదివారం ముంబయిలో జరిగిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు. మహరాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని కన్నీటిపర్యంతమయ్యారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అశోక్‌ చవాన్‌ను ఉద్దేశించే అని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.

‘ఆయన మా అమ్మకు ఫోన్‌ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

‘‘ఆయన చెప్పింది నా గురించే అయితే.. ఆ మాటలు నిరాధారమైనవి. నేను రాజీనామా చేసేవరకు ఆ విషయం ఎవరికీ తేలీదు. నా నిర్ణయం ప్రకటించేవరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే పని చేశాను. నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు. నేను ఆమెతో మాట్లాడి, కన్నీరు పెట్టుకున్నానన్నది నిరాధారమైన వ్యాఖ్య. ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఈ ప్రకటనలు చేశారు’’ అని ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇదిలాఉంటే.. ఈ మాజీ సీఎంపై పలు కేసులున్నాయి. ఆదర్శ్‌ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో 2010లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని