Sena vs Sena: ‘సుప్రీం ఆదేశాలను గౌరవించాలి’.. మహారాష్ట్ర స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర స్పీకర్‌ పట్టించుకోకపోవడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated : 19 Sep 2023 06:12 IST

దిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేతోపాటు పలువురు శివసేన ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీం కోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్‌ పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకనైనా నిర్ణయం తీసుకోవడానికి ఎంతకాలం పడుతుందో కాలక్రమాన్ని వారంలోగా తెలియజేయాలని మహారాష్ట్ర స్పీకర్‌కు (Speaker) సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్పీకర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ‘సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని అభిప్రాయపడింది. అనర్హత పిటిషన్ల పరిష్కారం కోసం స్పీకర్‌ పెట్టుకున్న కాలపరిమితిని తెలియజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు (స్పీకర్‌ తరఫున హాజరైన) సుప్రీం ధర్మాసనం సూచించింది.

Lok Sabha: ప్రధాని మోదీ నోట ‘రహ్మాన్‌ బర్క్‌’ మాట..!

శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాజపాతో కలిసి జూన్‌ 2022లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు అందింది. ఇదే సమయంలో ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ అనర్హత పిటిషన్లపై నిర్దేశిత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మే 11న స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఐదు నెలలు గడుస్తున్నా ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. వారంలోగా టైమ్‌లైన్‌ను తెలియజేయాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని