Lok Sabha: ప్రధాని మోదీ నోట ‘రహ్మాన్‌ బర్క్‌’ మాట..!

లోక్‌సభలో అత్యంత వృద్ధ, పిన్న వయసు సభ్యులతోపాటు సుదీర్ఘకాలం సేవలందించిన నేతల పేర్లనూ ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎస్పీ ఎంపీ రహ్మాన్‌ బర్క్‌ గురించి మాట్లాడారు.

Published : 18 Sep 2023 17:34 IST

దిల్లీ: తొమ్మిది దశాబ్దాలకుపైగా సేవలందించిన భారత పార్లమెంటు పాత భవనం (Parliament Old Building) నుంచి కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో.. లోక్‌సభ ప్రాముఖ్యత, మునుపటి, ప్రస్తుత సభ్యుల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కొనియాడారు. ఈ సందర్భంగా లోక్‌సభలో అత్యంత వృద్ధ, పిన్న వయసు సభ్యులతోపాటు సుదీర్ఘకాలం సేవలందించిన నేతల పేర్లనూ ప్రధానమంత్రి ప్రస్తావించారు.

లోక్‌సభలో ప్రస్తుతం అత్యంత ఎక్కువ వయసు కలిగిన షఫీకుర్‌ రహ్మాన్‌ బర్క్‌ పేరును ప్రధాని మోదీ ప్రస్తావించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన బర్క్‌ వయస్సు 93ఏళ్లు. లోక్‌సభ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయన ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి 1996లో గెలుపొందిన బర్క్‌.. అంతకుముందు నాలుగుసార్లు ఎమ్మెల్యేగాను విజయం సాధించారు. 1998, 2004లో మొరాదాబాద్‌ నుంచి ఎన్నికవగా..2009, 2019లో సంభల్‌ నుంచి గెలుపొందారు.

వివాదాలకు కేంద్ర బిందువు..

లోక్‌సభలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా ఉన్న రహ్మాన్‌ బర్క్‌.. పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. 2019లో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ‘వందే మాతరం’ అనేందుకు నిరాకరించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్‌లు ఆక్రమించిన ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇక్కడ దేశద్రోహం కేసు కూడా నమోదయ్యింది.

ఎంతో ప్రయాసతో తెలంగాణ ఏర్పాటు: లోక్‌సభలో ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ

ఇక అత్యంత పిన్న వయస్కురాలిగా బిజూ జనతాదళ్‌ (BJD) పార్టీ సభ్యురాలు చంద్రాణి ముర్ము నిలిచారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ హరిహరన్‌ సోరెన్‌ కుమార్తె అయిన ఆమె.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఒడిశాలోని కియోంఝర్ స్థానం నుంచి 25 ఏళ్ల వయసులోనే గెలుపొందారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టి.. లోక్‌సభ్యుల్లో పిన్న వయస్కురాలిగా కొనసాగుతున్నారు.

ఇంద్రజిత్‌ గుప్తాదే రికార్డు..

లోక్‌సభ ఎంపీగా సుదీర్ఘకాలం సేవలందించిన కమ్యూనిస్టు పార్టీకి (సీపీఐ) చెందిన ఇంద్రజిత్‌ గుప్తానూ ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. 1960-2001 మధ్యకాలంలో 36ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం సేవలందించిన వ్యక్తి ఇంద్రజిత్‌ గుప్తా. 1960లో జరిగిన పార్లమెంటు ఉపఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఆయన.. కేవలం 1977-80 మినహా సుమారు నాలుగు దశాబ్దాల పాటు లోక్‌సభలో సేవలందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2001లో మరణించేవరకూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లోని కలకత్తా సౌత్‌వెస్ట్‌, అలీపుర్‌, బషీర్‌హట్‌, మిద్నాపుర్‌ లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన గుప్తా.. హెచ్‌డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వాల్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని