SC: ఉచితాల బడ్జెట్.. సాధారణ బడ్జెట్‌ను దాటిపోయింది: సుప్రీం

ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోబపెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ వాగ్దానాలు తీవ్రమైన సమస్య అంటూ మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 26 Jan 2022 01:48 IST

ఇది చాలా తీవ్రమైన సమస్యంటూ వ్యాఖ్య

దిల్లీ: ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ వాగ్దానాలు తీవ్రమైన సమస్య అంటూ మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని ఎలా కట్టడిచేస్తారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల సంఘం, కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. 

‘దీనిని చట్టబద్ధంగా ఎలా నియంత్రించాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోగా ఇది సాధ్యమవుతుందా..? ఉచితాల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను మించిపోయింది. ఇది చాలా తీవ్రమైన సమస్య’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలంటూ గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు. 

ఎన్నికలకు ముందు ఉచితాలతో మభ్యపెట్టే పార్టీల గుర్తులను సీజ్‌ చేసేలా, పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని