SC: మీ లాయర్లనూ జైలులో ఉండనివ్వాలా..? సుకేశ్‌కు ‘సుప్రీం’ చురకలు!

జైలులో తన న్యాయవాదులతో కలిసే సమయాన్ని పొడిగించాలంటూ ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ‘మీరు మీ లాయర్ల పేర్లు చెప్పండి. వారిని కూడా జైల్లోనే ఉండేందుకు అనుమతించాలని మేం జైలు అధికారులను అడుగుతాం’ అని సుప్రీం ధర్మాసనం చురకలంటించింది.

Published : 17 May 2023 01:36 IST

దిల్లీ: ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrasekhar)కు సుప్రీం కోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ప్రస్తుతం జైలులో ఉన్న అతను.. తన న్యాయవాదులతో కలిసే సమయాన్ని పొడిగించాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జైలు నిబంధనల ప్రకారం చంద్రశేఖర్‌కు ఇప్పటికే ఈ మేరకు అవకాశం లభిస్తున్నట్లు జస్టిస్‌ అజయ్ రస్తోగి, జస్టిస్‌ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. ‘మీరు మీ లాయర్ల పేర్లు చెప్పండి. వారు కూడా జైల్లోనే ఉండేందుకు అనుమతించాలని మేం జైలు అధికారులను అడుగుతాం. ఈ కోర్టులో మీరు అసలు ఎలాంటి ప్రకటన చేస్తున్నారు? మీకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కావాలా?’ అని ధర్మాసనం చురకలంటించింది.

సుకేశ్‌పై ఆరు నగరాల్లో 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 10 మందికిపైగా న్యాయవాదులు ఈ కేసులను చూస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం న్యాయవాదులను కలిసేందుకు వారానికి రెండుసార్లు 30 నిమిషాలు మాత్రమే అనుమతి ఇస్తున్నారని, ఇది సరిపోదని వాదించారు. ఇది తన క్లయింట్ హక్కులను హరిస్తోందని పేర్కొన్నారు. అయితే, అసాధారణ ఉపశమనం కోసం పిటిషన్‌దారు అభ్యర్థించారని.. దీనికి అనుమతించబోమని ధర్మాసనం వెల్లడించింది. వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం.. ఖైదీలకు నెలలో కొన్నిసార్లు మాత్రమే వారి బంధువులు/ స్నేహితులతో భేటీకి అనుమతిస్తారు. మనీలాండరింగ్‌తోపాటు పలువురిని మోసగించాడన్న ఆరోపణల కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని