Japanese Tourist: హోలీ వేడుకల్లో అసభ్య ప్రవర్తన.. భారత్‌ విడిచి వెళ్లిన జపాన్‌ యువతి

హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతి(Japanese Tourist)తో కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. వీటిపై తీవ్రం ఆగ్రహం వ్యక్తమైంది.

Updated : 11 Mar 2023 14:03 IST

దిల్లీ: ఇటీవల జరిగిన హోలీ వేడుక(Holi Celebrations)ల్లో జపాన్‌( Japan)కు చెందిన యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దిల్లీలో జరిగిన ఈ ఘటనలో కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా రంగులు పూయడం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అలాగే ఆ టూరిస్టు భారత్‌ వీడి, బంగ్లాదేశ్‌ వెళ్లిపోయింది.

భారత్‌ పర్యటనకు వచ్చిన జపాన్‌ యువతి దిల్లీలోని పహార్‌ గంజ్‌ ప్రాంతంలో ఉంది. దేశమంతా హోలీ ఉత్సవాలు చేసుకుంటున్న తరుణంలో కొందరు యువకులు ఈ జపాన్‌ టూరిస్టు(Japanese Tourist)ను గట్టిగా పట్టుకొని, ఆమెను చుట్టుముట్టి రంగులు పూశారు. తలపై కోడిగుడ్లు కొట్టారు. వారిని విడిపించుకొని దూరంగా వెళ్తున్న ఆమెను మరో యువకుడు పట్టుకోబోగా.. అతడి చెంప పగులగొట్టింది. వారు ఆమెతో ప్రవర్తించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే వారిపై సదరు యువతి ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. దీని తర్వాత బంగ్లాదేశ్‌ వెళ్లిపోయిన ఆమె.. ట్విటర్‌గా వేదికగా స్పందించింది. ‘నేను క్షేమంగానే ఉన్నాను. ఈ విషయం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు’ అని ఆ యువతి ట్వీట్ చేసింది. 

కాగా ఈ వీడియోలపై దిల్లీ మహిళా కమిషనర్‌ స్వాతీమాలీవాల్‌(Swati Maliwal) స్పందించారు. ఈ ఘటన వీడియోలు పరిశీలించి, దానికి పాల్పడినవారిని అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఆ వ్యక్తుల ప్రవర్తన  సరిగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని