Covid: కొవిడ్‌ తర్వాత యువతలో ఆకస్మిక మరణాలు..! కేంద్రం ఏం చెప్పిందంటే..?

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ (Covid Pandemic) తర్వాత దేశంలో కొందరు యువతలో ఆకస్మిక మరణాలకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

Published : 21 Jul 2023 17:55 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి విజృంభణ (Covid Pandemic) తర్వాత దేశంలోని యువతలో ఆకస్మిక మరణాలు నమోదవుతుండటం చూస్తున్నామని, ఇందుకు గల కారణాలను నిర్ధారించేందుకు అవసరమైన ఆధారాలు ఇంకా అందుబాటులోకి రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. కొవిడ్‌ విజృంభణ తర్వాత పెరుగుతోన్న గుండెపోటు (Cardiac Arrest) కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మూడు అధ్యయనాలు చేస్తోందన్నారు. కొవిడ్‌ తర్వాత గుండెపోటు కేసులు పెరగడంపై లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.

దేశంలో 18 నుంచి 45ఏళ్ల యువకుల్లో ఆకస్మిక మరణాలకు దారితీస్తున్న అంశాలకు సంబంధించి బహుళ కేంద్రాల్లో సరిపోల్చే (a multi-centric matched) అధ్యయనం జరుగుతోందని కేంద్రమంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 40 ఆస్పత్రులు/పరిశోధనా కేంద్రాల్లో ఇవి జరుగుతున్నాయన్నారు. 2022లో దేశంలో 18 నుంచి 45ఏళ్ల వయసు వారిలో చోటుచేసుకున్న రక్తం గడ్డ కట్టుకుపోయే ఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 30 కొవిడ్‌ పరిశోధన ఆస్పత్రుల్లో మరో అధ్యయనం జరుగుతోందన్నారు. వీటికితోడు యువతలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారణాలను గుర్తించేందుకు వర్చువల్‌, ఫిజికల్‌ శవపరీక్షల ద్వారా మరో అధ్యయనం కొనసాగుతోందని వివరించారు.

దేశాన్ని రక్షించినా.. భార్యను కాపాడుకోలేకపోయా..! కార్గిల్‌ వీరుడి దీనగాథ

గుండె వ్యాధుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ కింద రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అందిస్తోందని మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 724 జిల్లాల్లో ఎన్‌సీడీసీలు, 210 జిల్లా కార్డియాక్‌ కేర్‌ యూనిట్లు, 326 జిల్లా డే-కేర్‌ సెంటర్లతోపాటు 6110 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇక ఔషధాలపై మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ఆస్పత్రులు, వెల్‌నెస్‌ సెంటర్లలో జెనరిక్‌ మందులనే సిఫార్సు చేయాలని వైద్యులకు సూచించామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని