Tejasvi Surya: ఎమర్జెన్సీ డోర్‌ ఘటన.. అదంతా రాజకీయ ఎత్తుగడే..!

‘ఎమర్జెన్సీ డోర్‌’ ఘటనపై భాజపా ఎంపీ తేజస్వీ సూర్య(Tejasvi Surya) స్పందించారు. విపక్షాలు చేస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. 

Published : 19 Jan 2023 14:34 IST

బెంగళూరు: భాజపా(BJP) ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) ఇటీవల ఓ ఇండిగో (IndiGo) విమానంలో అత్యవసర ద్వారం తెరిచినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఎంపీని మీడియా ప్రశ్నించగా.. ఇదంతా రాజకీయ ఎత్తుగడ అని కొట్టిపారేశారు.

‘వాటిపై స్పందించి ఆ వ్యాఖ్యలకు ప్రచారం కల్పించదల్చుకోలేదు. నా పార్టీ, నియోజకవర్గంలో నేను చేయాల్సిన పనిపైనే నా దృష్టంతా ఉంది’ అని విమర్శలను తోసిపుచ్చారు. ఇదివరకే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) దీనిపై స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించారు. పొరబాటునే సూర్య ఆ తలుపుల్ని తెరిచినట్లు పేర్కొన్నారు. చెన్నై-తిరుచ్చి ఇండిగో (IndiGo) విమానంలో గత నెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను పొరబాటుగా తెరిచారని ఇండిగో మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పినట్లు పేర్కొంది.

ఈ ఘటన గురించి ఓ ప్రయాణికుడు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో సూర్యతో పాటు తమిళనాడు భాజపా చీఫ్ కె. అన్నామలై ఉన్నారు. వారికి దగ్గర్లోనే తన సీటు ఉందని తెలిపారు. ‘ఆయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే కూర్చున్నారు. ఎసీ సమీపంలోకి వెళ్లిన ఆయన తన చేతిని కిందికి తీసుకుంటున్న సమయంలో మోచేయి అత్యవసర ద్వారానికి తగిలింది. దాంతో డోర్ కాస్త పక్కకు జరిగింది. అక్కడ ఉద్దేశపూర్వకంగా ఏమీ జరగలేదు. ఆ వెంటనే ఆయన సిబ్బందికి సమాచారం ఇచ్చారు’ అని సదరు ప్రయాణికుడు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని