
Drugs case: సమీర్ వాంఖడే గురించి ఆర్యన్ను అడిగిన అధికారులు..!
ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న ఆర్యన్ను అధికారులు అర్ధరాత్రి వరకు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ అతడి నుంచి పలు విషయాలు ఆరా తీసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
క్రూజ్ నౌక ఎక్కాల్సిన పరిస్థితుల గురించి, డ్రగ్స్ సరఫరాదారులతో ఉన్న సంబంధాలు, అతడి స్నేహితులు, వారికి ఉన్న అలవాట్ల గురించి అధికారులు పలు ప్రశ్నలు వేశారని సమాచారం. అలాగే ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో మునుపటి దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఆర్యన్ను విడిపించేందుకు లంచం ఇవ్వాలంటూ అతడి తల్లిదండ్రులకు ఏదైనా ఒత్తిడి ఎదురైందా అని ఆరా తీసినట్లు చెప్పాయి. కాగా, డ్రగ్స్ దర్యాప్తు గురించి ఎన్సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ కేసులో విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం. దీనికి సంబంధించిన మరికొంతమంది కీలక వ్యక్తుల్ని విచారించాల్సి ఉంది’ అని వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.