NASA: అంగారకుడిపై నివాసముంటారా? దరఖాస్తులు ఆహ్వానించిన నాసా 

భూమిపై నివసించడం బోర్‌ కొడుతోందా? ఇలాంటి వాతావరణంలో కాకుండా..

Updated : 09 Aug 2021 10:23 IST

కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలో ఏడాదిపాటు ఉండే అవకాశం 
అమెరికా పౌరులకే వెసులుబాటు 

వాషింగ్టన్‌: భూమిపై నివసించడం బోర్‌ కొడుతోందా? ఇలాంటి వాతావరణంలో కాకుండా.. మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నారా? అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- ‘నాసా’ తాజాగా విడుదల చేసిన ప్రకటన మీలో ఆసక్తిని పెంచుతుంది! అంగారక గ్రహం తరహాలో కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలో ఏడాది పాటు నివసించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతానికి అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాస హోదా ఉన్నవారే దీనికి అర్హులు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రంలోని ఓ భవనంలో ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’ అనే ప్రత్యేక ఆవాసం ఉంది. దాని విస్తీర్ణం 1,700 చదరపు అడుగులు. త్రీడీ ముద్రిత విధానంలో సృష్టించిన ఈ ఆవాసంలో అంగారక గ్రహం తరహా వాతావరణం ఉంటుంది. అంగారకుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్న నాసా.. అక్కడికి వెళ్లేవారికి శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందో ముందుగానే తెలుసుకోవాలని నిర్ణయించింది. పరిమిత వనరులు, కమ్యూనికేషన్‌లో జాప్యం, పరికరాల వైఫల్యం వంటి సవాళ్లను వారు ఎలా ఎదుర్కొంటారన్నదానిపై అధ్యయనానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఔత్సాహికులైన అమెరికా పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. నలుగుర్ని ఎంపిక చేసి.. ఏడాది పాటు ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’లో ఉంచుతామని ప్రకటించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని