Modi US Tour: అమెరికా పర్యటన ముగించుకొని.. భారత్‌ చేరుకున్న మోదీ!

మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్‌ చేరుకున్నారు.

Updated : 26 Sep 2021 16:14 IST

ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమని వెల్లడి

దిల్లీ: మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డాతో సహా పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు క్వాడ్‌ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అందులో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్‌ పరిణామాలపై చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే ఏళ్లలో భారత్‌-అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోదీ ట్వీట్‌ చేశారు.

ఇక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన మోదీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఐరాస అనుకుంటే తన విశ్వసనీయత, సమర్థతను మరింత మెరుగుపర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధపాలన ఉండాలంటే ఐరాసను నిరంతరం బలోపేతం చేయాలన్నారు. ప్రపంచ ప్రయోజనాలను, విలువల్ని పరిరక్షించేలా ఐరాస తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. తగిన సమయంలో సరైన చర్య తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. వాతావరణ సంక్షోభం, కొవిడ్‌-19 మహమ్మారి వంటి సందర్భాల్లో ఐరాసపై అనేక ప్రశ్నలు ఉదయించాయని గుర్తుచేశారు. కరోనా వైరస్‌ మూలాలు కనిపెట్టడం, సులభతర వాణిజ్య ర్యాంకులు వంటి విషయాల్లో ప్రపంచ సంస్థల విశ్వసనీయత దెబ్బతిన్నదని మోదీ అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని