Sameer Wankhede: మంత్రి సంచలన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన ముంబయి ‘సింగం’

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడే పేరు మార్మోగుతోంది. క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల జరిగిన అరెస్టుల వెనుక ఈ ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయనపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Updated : 22 Oct 2021 13:50 IST

నా పిల్లలతో మాల్దీవులకు వెళ్లాను : సమీర్ వాంఖడే

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడే పేరు మార్మోగుతోంది. క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల జరిగిన అరెస్టుల వెనుక ఈ ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయనపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మాల్దీవుల పర్యటనపై పలు ప్రశ్నలు వేశారు. ఈ వ్యవహారంపై వాంఖడే జాతీయా మీడియాతో మాట్లాడారు.

‘అవన్నీ తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు. నేను దుబాయ్ వెళ్లలేదు. మాల్దీవులకు వెళ్లాను. వెళ్లింది కూడా నా పిల్లలతో.. సోదరితో కాదు. అదీ అన్ని అనుమతులు తీసుకొని, నా సొంత డబ్బుతో వెళ్లాను. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్లాను’ అని సమీర్ మీడియాకు వెల్లడించారు. ‘ఆయన ఒక రాష్ట్ర మంత్రి. తనకు అందిన సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు తగిన యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. ఆయన ఆరోపణలకు ఆధారాలుంటే.. ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత 15 రోజులుగా మాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మరణించిన నా తల్లి, ఇతర కుటుంబ సభ్యుల్నీ వదలడం లేదు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ఆయన మీడియాకు సమాధానం ఇచ్చారు.

ఎన్‌సీబీ, సమీర్ వాంఖడేపై నవాబ్ మాలిక్ గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి నిన్న మరోసారి వాంఖడేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాంఖడే ఒక తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య తర్వాత ఎన్‌సీబీకి వాంఖడే ప్రత్యేక అధికారిగా వచ్చారన్నారు. సుశాంత్ కేసు తేలకుండానే మధ్యలో ఎన్‌సీబీ వచ్చిందని, సినీ పరిశ్రమతో ఆటలాడుకోవడం మొదలు పెట్టిందని విమర్శించారు. కొందరిని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరిగాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సినీ పరిశ్రమ మాల్దీవుల్లో ఉందని.. అప్పుడు సమీర్‌ వాంఖడే, ఆయన కుటుంబం మాల్దీవుల్లో, దుబాయిలో ఏం చేస్తోందని ప్రశ్నించారు. సమీర్‌ వాంఖడే సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.‘‘ఆ సమయంలో సమీర్‌ వాంఖడేకు మాల్దీవులు, దుబాయిలో ఏం పని? ఆయన దుబాయిలో ఉన్నట్టు ఫొటోలు విడుదల చేస్తాను. మాల్దీవుల్లో వసూళ్లకు పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. సమీర్‌ వాట్సాప్‌ చాట్స్‌ని పరిశీలిస్తే ఎన్సీబీ కేసులు ఎంత బోగస్‌వో తెలుస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని