Supreme Court: గవర్నర్‌ నిర్ణయం తప్పే.. ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం: సుప్రీం

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు సమర్థనీయం కానప్పటికీ.. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యానించింది. 

Updated : 11 May 2023 19:41 IST

దిల్లీ: మహారాష్ట్ర( Maharashtra ) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. 

‘ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. సభలో మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని పిలవడం సబబు కాదు. గవర్నర్ విచక్షణాధికారాలను అమలు చేసిన తీరు చట్టపరంగా లేదు. అలాగే పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి బలపరీక్షను ఒక మాధ్యమంగా వాడలేం. అయితే, ఉద్ధవ్‌ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఠాక్రే రాజీనామా చేయడంతో.. అప్పటికే అతిపెద్ద పార్టీ అయిన భాజపా మద్దతున్న ఏక్‌నాథ్‌ శిందే వర్గంతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం సమర్థనీయమే ’అని వెల్లడించింది. 

శిందే, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నాటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని వాదనల్లో భాగంగా ఉద్ధవ్‌ వర్గం ప్రశ్నించింది. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తాము అనర్హత వేటు వేయలేమని సుప్రీం వెల్లడించింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది. 

శిందే రాజీనామా చేయాలి: ఉద్ధవ్‌

‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఏక్‌నాథ్‌ శిందే అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా రాజీనామా చేయాలి’అని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌ వెంట బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ కూడా ఉన్నారు.

ఇది మా నైతిక విజయం: సంజయ్ రౌత్‌

ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు నిర్ణయం చెబుతోందని ఉద్ధవ్‌ వర్గం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఇది తమకు నైతిక విజయమని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని