Mulayam Singh Yadav: రాజకీయ మల్లయోధుడు.. యూపీ ‘నేతాజీ’

ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగానూ సేవలందించి ములాయం దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

Updated : 11 Oct 2022 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82).. దాదాపు 40 రోజులకు పైగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడు పర్యాయాలు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, పది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్రమంత్రిగానూ సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

పేద రైతు కుటుంబంలో పుట్టి.. రాజకీయ ప్రభంజనం సృష్టించి..

రాజకీయ మల్లయోధుడిగా పేరొందిన ములాయం సింగ్‌ యాదవ్‌ నవంబర్‌ 22, 1939లో యూపీలోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా వర్సిటీ పరిధిలోని బీఆర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నారు. అనంతరం కర్హైల్‌లో లెక్చరర్‌గానూ పనిచేశారు. రెజ్లింగ్‌ పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించే ములాయం.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ మల్లయోధుడిగా ఎదిగారు. ములాయం తొలుత మాలతిదేవిని వివాహమాడారు. వారికి 1973లో అఖిలేశ్‌ జన్మించారు. 2003లో మాలతీ దేవి కన్నుమూయగా అనంతరం సాధనా యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సాధనా యాదవ్‌ సైతం కన్నుమూశారు. తొలి భార్య కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ కాగా.. రెండో భార్య సాధనా యాదవ్‌కు ప్రతీక్‌ యాదవ్‌ ఉన్నారు. ప్రతీక్‌ యాదవ్‌ సతీమణి అపర్ణా యాదవ్‌ ఇటీవల యూపీ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు.

యూపీ ప్రజల నేతాజీగా..

సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రేమతో నేతాజీగా పిలుచుకునే ములాయం 1960లలో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం దేశంలో తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లో తన జైత్రయాత్రను కొనసాగించారు. 1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో 1996 నుంచి 1998 మధ్య దేశ రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు. అనంతరం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 1989 నుంచి 1991వరకు తొలిసారి సీఎంగా కొనసాగగా.. 1993 నుంచి 1995 వరకు, చివరగా 2003 నుంచి 2007 వరకు యూపీ సీఎంగా సేవలందించారు. దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో గానీ, అధికార కూటమికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో గానీ ములాయం నిర్మాణాత్మక పాత్ర పోషించారు. 

19 నెలలు నిర్బంధంలో..

సోషలిస్టు నాయకుడు డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. సర్వశ్రీ మధు లిమాయే, రామ్ సేవక్ యాదవ్, కర్పూరి ఠాకూర్, జనేశ్వర్ మిశ్రా, రాజ్ నారాయణ్ వంటి వ్యక్తులతో పరిచయం తర్వాత 15 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో చేరారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్‌, చంద్రశేఖర్ పనితీరుతో ప్రేరణ పొందారు. కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం, హక్కుల రక్షణ కోరుతూ ములాయం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలో 1962 నుంచి 1963 వరకు ఇటావా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అరెస్టయి జైలుకు వెళ్లిన ములాయం.. 19 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. సహకార, పశుసంవర్దకశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1980లో లోక్‌దళ్‌ పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు. ఈ పార్టీ తర్వాత జనతాదళ్‌లో భాగమైంది.

1982లో యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన.. 1985 దాకా ఆ పదవిలో కొనసాగారు. లోక్‌దళ్‌ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత క్రాంతికారి మోర్చా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1990లో కేంద్రంలోని వీపీ సింగ్‌ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్‌ సారథ్యంలోని జనతాదళ్‌‌(సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు. కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో యూపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ములాయం సింగ్‌ పార్టీపై భాజపా నెగ్గింది. అనంతరం 1992లో ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. 1993లో జరిగిన ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పొత్తుపెట్టుకొని గెలిచారు. దీంతో కాంగ్రెస్‌, జనతాదళ్‌ మద్దతుతో రెండో దఫా ముఖ్యమంత్రిగా ములాయం ఆసీనులయ్యారు. మిత్ర పక్షాలతో విభేదాలు  రావడం వల్ల 1995లో ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. ఇక 2002లో భాజపాతో కలిసి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2003లో భాజపా తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. దీంతో రాజకీయ వ్యూహ పరిణతి ఉన్న ములాయం రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ములాయం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని