Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్‌

భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను పటిష్ఠపరచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.

Published : 01 Oct 2023 15:55 IST

దిల్లీ: భారతదేశం 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) అన్నారు. రక్షణశాఖ ఆర్థిక వనరులను త్రివిధ దళాలు సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన డిఫెన్స్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ (DAD) 276వ వార్షిక దినోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ డిజిటల్‌ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. డీఏడీని రక్షణ శాఖ నిధులకు సంరక్షకుడిగా అభివర్ణించిన ఆయన...  ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి, వెంటనే సమీక్షించగలిగేలా అంతర్గత నిఘా యాంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల కేవలం సమస్యలు త్వరగా పరిష్కారం కావడమే కాకుండా ప్రజలకు రక్షణ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. 

‘‘ మనం అభివృద్ధి చెందిన  దేశాల సరసన చేరాలంటే.. కచ్చితంగా బలమైన సాయుధ బలగాలను, రక్షణ పరికరాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం అందుబాటులో ఉన్న రక్షణశాఖ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలి. డిమాండ్‌, సర్వీసు, నిధుల మధ్య సమతూకం పాటించాలి’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. మార్కెట్‌లోని వివిధ అంశాలను పరిశోధించి, అధ్యయనం చేయగలిగిన అధికారులను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం అంతర్గత స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని డీఏడీకి రాజ్‌నాథ్‌ సూచించారు. అత్యంత పారదర్శకతతో, సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

రక్షణశాఖకు సంబంధించి ఆర్థిక సలహాలను అందించే క్రమంలో డీఏడీ అధికారులు ముఖ్యంగా రెండు అంశాలను గుర్తుంచుకోవాలని రాజ్‌నాథ్‌ సూచించారు. ఏదైనా పరికరంగానీ, టెక్నాలజీగానీ కొనుగోలు చేయాల్సి వస్తే.. అది ఎంతవరకు అవసరం? ఎంత వరకు ఖర్చు చేయొచ్చు? అనే అంశాలపై డీఏడీ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. అదే ప్రొడక్ట్‌ వేరేచోట తక్కువ ధరకే దొరుకుతున్నట్లయితే, కచ్చితంగా ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్టాండింగ్‌ కమిటీలు దీనికి ఉపకరిస్తాయని రాజ్‌నాథ్‌ చెప్పారు. పెద్దపెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అంతర్గత పరిశోధన బృందాలను ఏర్పాటు చేస్తాయని, వాటిలాగే మార్కెట్‌ను శోధించేందుకు డీఏడీ కూడా తమ సంస్థలో ఒక బృందాన్ని అభివృద్ధి చేయాలని రాజ్‌నాథ్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని