డీప్‌ఫేక్‌ వీడియోల కట్టడికి కఠిన నిబంధనలు: కేంద్ర మంత్రి

ఏఐ, డీప్‌ఫేక్‌ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated : 16 Jan 2024 06:45 IST

దిల్లీ: కృత్రిమమేధ (AI) ద్వారా డీప్‌ఫేక్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులే లక్ష్యంగా కొందరు సైబర్‌ నేరగాళ్లు వీటిని రూపొందిస్తున్నారు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) డీప్‌ఫేక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. సచిన్‌ షేర్‌ చేసిన డీప్‌ఫేక్‌ వీడియోపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందించారు. ఏఐ, డీప్‌ఫేక్‌ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడించారు.

సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ అసహనం

‘‘ఏఐ ఆధారంగా తప్పుడు సమాచారంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు భారత సమాజానికి ప్రమాదకరం. ఇవి యూజర్లకు హాని చేయడంతోపాటు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు త్వరలోనే పటిష్ఠమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తాం’’ అని చంద్రశేఖర్‌ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ (PM Modi) కూడా డీప్‌ఫేక్‌ వీడియోలు సమాజానికి ప్రమాదకరంగా మారాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. గతేడాది నవంబరులో డీప్‌ఫేక్‌లపై సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని