Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ అసహనం

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. తాను ప్రచారం చేస్తున్నట్లు వైరల్‌ అవుతున్న వీడియో నకిలీదంటూ తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు.

Published : 16 Jan 2024 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌నకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి. సోషల్‌ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ.. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం’’ అని సచిన్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను కేంద్ర ఐటీశాఖ మంత్రి ఖాతా, మహారాష్ట్ర సైబర్‌ విభాగ ఖాతాకు ట్యాగ్‌ చేశారు.

‘స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు.

కాగా.. ఆ మధ్య సచిన్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడిన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లు మార్ఫింగ్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌తో ఉన్న ఫొటోను డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి వైరల్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, కొంతమంది తన పేరుతో నకిలీ ఖాతాలు (Fake Accounts) తెరిచారని, వాటిని నమ్మొద్దని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని