PPE కిట్లో ఉండలేక..బంధువులతో మాట్లాడలేక!

ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బాధితులు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి గుండె తరుక్కుపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు నర్సులు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లింది మొదలు..

Updated : 30 Apr 2021 20:39 IST

కొవిడ్‌ ఆస్పత్రుల్లో నర్సుల మనోవేదన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోంది. బాధితులు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే అది చూసి గుండె తరుక్కుపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు నర్సులు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లింది మొదలు.. తిరిగి వచ్చేంత వరకూ దాదాపు ఆరేడు గంటలు పీపీఈ కిట్లలోనే గడుపుతున్నారు.  తిరిగి ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యులతో కలవలేని పరిస్థితి. కరోనా మొదటి దశ వ్యాప్తి ఒక ఎత్తయితే రెండోదశలో పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. దీంతో నర్సులు తమ విధులు నిర్వర్తించడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న వేదనాభరిత సమస్యలను పంజాబ్‌లోని  పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎస్‌ఈఆర్‌)కు చెందిన నర్సులు చెప్పుకొచ్చారు.

సుఖ్‌చైన్‌ కౌర్‌ (48).. పీజీఐఎంఈఆర్‌లో సీనియర్‌ నర్సు. గత ఏడాది నుంచి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో దాదాపు 200 మంది నర్సులకు రోస్టరు విధానంలో ఈమె విధులు కేటాయిస్తున్నారు. కరోనా ప్రారంభమైప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఆస్పత్రికి కొవిడ్‌ బాధితుల తాకిడి ఎక్కువవడంతో వారాంతపు సెలవు తీసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టమే. ఆమెకు మధుమేహ సమస్య కూడా ఉంది. ఇంట్లో భర్త, ఇద్దరు పిల్లలు. ఈ పరిస్థితుల్లో విధులకు హాజరవ్వడం పెద్ద సవాలుగా మారిందంటున్నారు సుఖ్‌చైన్‌. ఓ వైపు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్త పడాల్సి వస్తోందంటున్నారు.

‘‘ ప్రస్తుత నిబంధనల ప్రకారం కొవిడ్‌ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లిన వెంటనే పీపీఈ కిట్‌ ధరించాలి. దాదాపు ఆరేడు గంటలు అందులోనే ఉండాలి. కనీసం మరుగుదొడ్లకు వెళ్లే అవకాశమూ లేదు. దీని కోసం డైపర్‌ లాంటి ప్రత్యామ్నాలేమైనా చూసుకోవాలే తప్ప..ఎట్టి పరిస్థితుల్లోనే పీపీఈ కిట్లు తొలగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఎక్కువసేపు పీపీఈ కిట్లు ధరించడం చాలా కష్టంగా ఉంది. చర్మ వ్యాధులు వస్తున్నాయి. సరిగా ఊపిరి ఆడటం లేదు. అప్పుడప్పుడు జలుబు, జ్వరం కూడా వచ్చేస్తున్నాయి’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘గత ఏడాది నుంచి నేను ఇంటిని పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో పరిస్థితులు చూసిన తర్వాత ఇంటికొచ్చి ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. అయితే, కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారు. అందువల్లే విధులకు హాజరవ్వగలుగుతున్నాను. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు వెళ్లిపోతుందా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. అందరూ ఉన్నా.. ఒంటరిగానే బతుకుతున్నాననే భాధ నన్ను వేధిస్తోంది. పరిస్థితులు చక్కబడితే అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాం’’ అని కౌర్‌ చెప్పుకొచ్చారు.

వైరస్‌ కలిసి బతకడం నేర్చుకున్నా..

అదే ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ నర్సుగా  వ్యాస్‌ పనిచేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి మొదట్లో చాలా భయమేసిందని, కానీ ఇప్పుడు కరోనా వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నానని ఆమె తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ‘‘ కరోనా వైరస్‌ నా వృత్తి జీవితంలోనూ.. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కరోనా తొలిదశ వ్యాప్తి చాలా భయమేసింది. పని మనిషి మానేసింది. రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కానీ, ఈసారి మాత్రం పరిస్థితులు మారాయి. ముక్కు నోరు మూసుకొని ఎవరిపని వారు చేసుకెళ్లిపోతున్నారు’’ అని ఆమె అన్నారు

అయితే కరోనా రెండో దశ వ్యాప్తిలో 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆమె చెప్పారు. కేవలం పంజాబ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ‘‘ కళ్లెదుటే యువకులు చనిపోతుంటే కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి. కానీ, ఏం చేయలేని నిస్సహాయ స్థితి. కొన్నిసార్లు వారి బంధువులకు ధైర్యం చెప్పి పంపిస్తుంటాం’’ అని వ్యాస్‌ చెప్పుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితులెప్పుడూ చూడలేదు

సుఖ్‌బీర్‌ కూడా అదే ఇన్‌స్టిట్యూట్‌లో శవాలను ప్యాక్‌ చేసి కుటుంబ సభ్యులకు అందిస్తుంటాడు. దాదాపు ఐదేళ్ల నుంచి ఇదే ఆయన ఉద్యోగం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూసి ఆయన కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనకెప్పుడూ ఎదురుకాలేదని అంటున్నాడు. ఇదంతా కేవలం వీరి ఆవేదనే కాదు.. ఇలాంటి పరిస్థితులు దేశంలో చాలా మందికి ఎదువుతూనే ఉన్నాయి. ఓ పక్క బెడ్ల కొరత.. సరే బెడ్‌ దొరికింది.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. బతికించుకుందామంటే ఆక్సిజన్ కొరత. ప్రాణవాయువు లేక బాధితులు కొట్టుమిట్టాడుతుంటే వారి బంధువుల వేదన వర్ణనాతీతం. కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఇలా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ మహమ్మారికి అంతమెప్పుడో..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని