Maldives: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటీ: ఎంపీ

భారత పర్యాటక రంగంతో మాల్దీవులకు సంబంధం ఏంటని లక్షద్వీప్‌ ఎంపీ ప్రశ్నించారు. భవిష్యత్తులో తమ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.

Updated : 08 Jan 2024 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లక్షద్వీప్‌ అభివృద్ధి చెందితే మాల్దీవుల(Maldives)కు వచ్చిన సమస్య ఏంటీ..? అని స్థానిక ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ ప్రశ్నించారు. భారత్‌-మాల్దీవుల వివాదంపై ఆయన స్పందించారు. ‘‘భవిష్యత్తులో లక్షద్వీప్‌ కచ్చితంగా పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిపారు. పర్యాటక కోణంలో ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా కొన్ని విషయాలు మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు సృష్టించేలా ప్రభుత్వాలకు పర్యాటక విధానం ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దీంతో మాల్దీవులకు వచ్చిన సమస్యేమిటీ’’ అని ప్రశ్నించారు.

మాల్దీవులకు ఫ్లైట్‌ బుకింగ్స్‌ నిలిపివేసిన ఈజ్‌మైట్రిప్‌

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల మంత్రులు మరియం షివునా, మల్షా షరీఫ్‌, అబ్దుల్లా మజూం అక్కసు వెళ్లగక్కి.. దారుణ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వమూ తీవ్రంగా స్పందించింది.

దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది. మంత్రుల వ్యాఖ్యలను మాలెలోని భారత హైకమిషన్‌ వర్గాలు మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.

మాల్దీవుల దౌత్యవేత్తకు సమన్లు

భారత్‌-మాల్దీవుల దౌత్య వివాదం మరింత వేడెక్కింది. తాజాగా భారత విదేశాంగ శాఖ మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షాహీబ్‌కు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం ఆయన మన విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని