Choodalani Vundi: డైలాగ్‌ లేకుండా చిరంజీవి సీన్‌.. ఆ మాటకు షాకైన అశ్వనీదత్‌

చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘చూడాలని ఉంది’ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు..

Updated : 27 Aug 2023 16:32 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా గుణశేఖర్‌ (Gunashekar) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi). అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో (ఆగస్టు 27) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులతో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ‘చూడాలని ఉంది’ విశేషంగా అలరించింది. ఇక మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్‌. ఇందులో చిరు-అంజల ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ చాలా స్పెషల్‌. చిరు, అంజలిల మధ్య డైలాగ్స్‌ లేకుండా కేవలం హావభావాలతో ఆ సీన్‌ను తెరకెక్కించి అలరించారు గుణశేఖర్‌. ఆ సీన్‌ గురించి ఓ సందర్భంలో గుణశేఖర్‌ ఇలా పంచుకున్నారు.

‘‘రైల్వేస్టేషన్‌లో ఆ లవ్‌ సీన్‌ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవిగారికి అసలు డైలాగ్స్‌ ఉండవు. ఆయన స్టేషన్‌లో చైర్‌ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్‌ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది అంత సేపు షూట్‌ చేశాం. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నేను అడిగా. నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt)గారు షాకైపోయారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్‌ పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మూడు రోజులు చిరంజీవిగారిని పెట్టుకుని షూట్‌ చేయడం చాలా కష్టం. పైగా ఆయనతో షూటింగ్‌ అంటే రైల్వేశాఖ కూడా అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది. రైళ్లు ఆగిపోతాయి. సమయాలు మారిపోతాయి. అతి కష్టమ్మీద అనుమతి లభించింది. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఆగిపోయారు’’ అని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు.

చిన్న పిల్లలతో ‘రామాయణం’ తీస్తుండగానే తన తర్వాతి సినిమా కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఉండాలనే ఉద్దేశంతో ‘చూడాలని ఉంది’ కథ రాసుకున్నారు గుణశేఖర్‌. ఈ క్రమంలో మధు సుంకర, అశ్వినీదత్‌లు గుణశేఖర్‌ దగ్గరకు వచ్చి, ‘చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాం ఏదైనా కథ ఉంటే చెప్పండి’ అని అడగటంతో అప్పటికే తాను అనుకున్న కథను చిన్న లైన్‌గా చెప్పారు. స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి చేసిన తర్వాత కథ చెప్పమని అశ్వినీదత్‌ అడిగితే, ‘చిరంజీవిగారి ముందే మీకు చెబుతాను’ అని రెండు గంటల పాటు చిరంజీవి, అశ్వినీదత్‌, అల్లు అరవింద్‌లకు కథ వినిపించారు గుణశేఖర్‌. కథ విన్న వెంటనే చిరు కూడా ఓకే చెప్పారు. ఇలా ‘చూడాలని ఉంది’ పట్టాలెక్కింది. చిరుకు జోడీగా అంజలి ఝవేరితో పాటు, సౌందర్య కూడా నటించింది. ప్రకాశ్‌రాజ్‌ ప్రతినాయకుడిగా మెప్పించారు.

ఇక మణిశర్మ (Mani Sharma) అందించిన ప్రతి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ‘రామా చిలకమ్మా’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్‌ నారాయణతో పాడించారు మణిశర్మ. మొదటిసారి నలుగురు నాన్‌ తెలుగు సింగర్స్‌ పాడిన ఆల్బమ్‌ ఇది. సాధారణంగా అప్పట్లో చిరంజీవి పరిచయ సన్నివేశం పాటతో గానీ, ఫైట్‌తోగానీ మొదలయ్యేది. పాటలైతే బ్రేక్‌ డ్యాన్స్‌ ఉండాల్సిందే. కానీ అందుకు భిన్నంగా క్లాసికల్‌గా ఉండే ‘యమహా నగరి’ పాటను పెడతామని గుణశేఖర్‌ సలహా ఇవ్వడంతో అందుకు చిరు, అశ్వనీదత్‌ ఇద్దరూ అంగీకరించారు. ఈ పాటకు వేటూరి నాలుగు చరణాలు ఇచ్చారు. అన్నీ బాగున్నా, ఆఖరికి మూడు చరణాలు పెట్టారు. ఒక క్లాసికల్‌ పాటతో చిరంజీవి పాత్రను పరిచయం చేయడంలో అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ‘గుంటూరు బాంబు తీయ్‌’ అంటూ బ్రహ్మానందంచేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని