800 Trailer: పేదవాడు గొప్పవాడయ్యాడు

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’. టైటిల్‌ పాత్రను మధుర్‌ మిట్టల్‌ పోషించారు.

Updated : 29 Oct 2023 11:28 IST

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’. టైటిల్‌ పాత్రను మధుర్‌ మిట్టల్‌ పోషించారు. ఎంఎస్‌ శ్రీపతి దర్శకుడు. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ముంబయిలో మంగళవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మురళీధరన్‌ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తనని తొలిసారి కలిశా. అప్పటి నుంచి మా మధ్య స్నేహం అలాగే ఉంది. కొన్నిసార్లు మన ఆట పట్ల నిరుత్సాహపడతాం. అక్కడ నుంచి మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్‌ అదే చేశాడు. పిచ్‌ ఎలా ఉన్నా సరే బంతిని టర్న్‌ చేయగలడు. తనని ఎలా ఎదుర్కోవాలని మేము మీటింగ్‌ల్లో చర్చించుకునే వాళ్లం’’ అన్నారు. ‘‘ఆట ఆడేటప్పుడు ఎంజాయ్‌ చేస్తుంటే ఫలితం గురించి ఆలోచించం. క్రికెటర్లకు నేనిచ్చే సలహా అదే. నేను బౌలింగ్‌ చేసేటప్పుడు రన్స్‌ చేయడంలో లారా సక్సెస్‌ అయ్యాడు. కానీ, నా బౌలింగ్‌ శైలిని పట్టుకోలేదు. సచిన్‌ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్‌. ‘ఎవరికీ తెలియని ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని కథ’ అంటూ మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘పౌర హక్కులు లేకుండా బానిసలుగా బతకవచ్చిన వారికి పౌరసత్వం లభించడం చాలా కష్టం. ఈరోజు దేశమే తిరిగి చూసేలాగా ఓ పేదవాడు గొప్పోడయ్యాడు’ అనే వ్యాఖ్యలతో ఉన్న ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ కార్యక్రమంలో వెంకట్‌ ప్రభు, మధుర్‌ మిట్టల్‌, పా.రంజిత్‌, సనత్‌ జయసూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని