ఫేమ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారుగా..!

నటీనటులుగా వెండితెరపై మెరిసి.. తమ నటనతో అభిమానులను సొంతం చేసుకున్న ఎంతోమంది స్టార్స్‌ వ్యాపారరంగంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది తారలు ఇప్పటికే వ్యాపారవేత్తలుగా గుర్తింపు తెచ్చుకోగా..

Updated : 25 Dec 2020 11:34 IST

ఈ ఏడాది వ్యాపార రంగంలో స్టార్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ నటనతో అభిమానులను మెప్పించిన ఎంతో మంది స్టార్స్‌ వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. కొంతమంది తారలు ఇప్పటికే వ్యాపారవేత్తలుగా గుర్తింపు తెచ్చుకోగా.. మరికొంతమంది ఈ ఏడాదిలోనే బిజినెస్‌ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్యాషన్‌రంగం, రెస్టారెంట్లు.. ఇలా పలువురు తారలు తమ ఫేమ్‌తో కొనుగోలుదారుడిని ఆకర్షిస్తున్నారు. ఈ ఏడాదిలో బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టిన కొంతమంది తారలు వీరే..

‘సాకీ’

అగ్రకథానాయిక సమంత అక్కినేని ఈ ఏడాది వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిజినెస్‌ వుమెన్‌గా వస్త్ర వ్యాపార రంగంలో తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ‘సాకీ’ బ్రాండ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించారు. తన అభిరుచికి అద్దంపట్టేలా ఈ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చానని ఆమె వెల్లడించారు. ‘సాకీ’ వేదికగా నేటితరం అమ్మాయిలకు కావాల్సిన అన్నిరకాల ట్రెండీ, క్లాసిక్‌వేర్ దుస్తులను.. సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచారు. ఈ మధ్య కాలంలోనే తన పెంపుడు శునకం హాష్ పేరుతో ఫ్యాషన్‌ జ్యూవెలరీని కూడా ఆన్‌లైన్‌ కొనుగోలుదారులకు చేరువ చేశారు. మరోవైపు ఇప్పటికే సమంత EKAM ప్రీ స్కూల్‌ను తన స్నేహితులతో కలిసి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

‘కిచ్డ్’

డబ్బులు విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు టాలీవుడ్‌ ‘మిత్రవింద’ కాజల్‌ అగర్వాల్‌. ప్రముఖ వ్యాపారవేత్త, ఇంటీరియర్‌ డిజైనర్‌ గౌతమ్‌ కిచ్లూతో అక్టోబర్‌ నెలలో ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ వివాహమైన రెండు నెలల్లోనే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. తన భర్తతో కలిసి ‘కిచ్డ్‌’ అనే  బ్రాండ్‌ను ఇటీవల ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ బ్రాండ్‌లో మరెన్నో ఆధునాతన వస్తువులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ జంట వెల్లడించింది.

ఈద్-ఆ-మమ్మ

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌.. ఇటీవల బిజినెస్‌ వుమెన్‌గా మారారు. ‘ఈద్‌-ఆ-మమ్మ’ పేరుతో ఆమె వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో ప్రస్తుతానికి కేవలం చిన్న పిల్లలకు మాత్రమే దుస్తులు అందుబాటులో ఉన్నాయి. 2 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు సౌకర్యవంతమైన దుస్తులు ఈ బ్రాండ్‌లో దొరుకుతాయి.

గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ..

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సైతం తన అన్న బాటలోనే అడుగులు వేస్తున్నారు. ‘దొరసాని’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన ఇటీవల ‘మిడిల్‌క్లాస్‌ మెలోడిస్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో.. తన స్నేహితులతో కలిసి ‘గుడ్ వైబ్స్‌ ఓన్లీ’ అనే కేఫ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌వాసులను ఈ రెస్టారెంట్‌ ఎంతగానో ఆకర్షిస్తోంది.

బాస్టియన్‌..

సాగరకన్య శిల్పాశెట్టి వ్యాపార రంగంలో తన సత్తా చాటుతున్నారు. లగ్జరీ రెస్టారెంట్స్‌ ఏర్పాటు చేసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ‘బాస్టియన్‌’ పేరుతో ఇప్పటికే ముంబయిలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా రెస్టారెంట్లను నడుపుతున్న శిల్పాశెట్టి ఈ ఏడాది వర్లీలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. అత్యాధునిక డిజైన్లతో సెలబ్రిటీలను ఆకట్టుకునేలా ఈ హై ఎండ్‌ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. దీనితోపాటు ఆమె సొంతంగా ఓ ఫిట్‌నెస్‌ యాప్‌ను కూడా నడుపుతున్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ మమాఎర్త్‌లోనూ ఆమెకు భాగస్వామ్యం ఉంది.

ఫ్రెష్‌..

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌.. ‘బీయింగ్‌ హ్యూమన్‌’ పేరుతో వస్త్ర వ్యాపార రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. కేవలం మేన్స్‌వేర్‌ దుస్తులను మాత్రమే ఇందులో అందుబాటులో ఉంచారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన సరికొత్త వ్యాపారానికి నాంది పలికారు. ‘ఫ్రెష్‌’ పేరుతో.. అతితక్కువ ధరలకు శానిటైజర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో మరిన్ని వస్తువులను ‘ఫ్రెష్‌’ వేదికగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని భాయ్‌ తెలిపారు.

వీరేకాకుండా పాయల్‌రాజ్‌పూత్‌ సైతం వస్త్రవ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మరోవైపు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇప్పటికే పలు జిమ్‌ సెంటర్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ.. ‘రౌడీ’ బ్రాండ్‌తో యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు