కమలా హారిస్‌లా కలలు కనండి: ప్రియాంక

అమ్మాయిలందరూ పెద్దపెద్ద కలలు కనాలని అంతర్జాతీయనటి ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఈ లోకంలో మహిళలకు సాధ్యం కానిది ఏదీ ఉండదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ను ఆమె ప్రశంసల్లో ముంచెత్తారు.

Updated : 08 Nov 2020 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మాయిలందరూ పెద్దపెద్ద కలలు కనాలని అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఈ లోకంలో మహిళలకు సాధ్యం కానిది ఏదీ ఉండదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ను ఆమె ప్రశంసల్లో ముంచెత్తారు. ఈమేరకు ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ‘ఈసారి అమెరికా ఎన్నికలు ఎంతో ఆసక్తిగా సాగాయి. ఆ దేశం మరోసారి సంఖ్యాపరమైన తీర్పునిచ్చింది. ఏ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారిస్‌కు శుభాకాంక్షలు. ప్రతి అమ్మాయి పెద్దపెద్ద కలలు కనాలి. ఎంత పెద్ద కలైనా నెరవేర్చుకోవచ్చు అనడానికి కమలా హారిస్‌ విజయమే ఉదాహరణ’ అని ప్రియాంక పేర్కొన్నారు.
ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రియాంక బెర్లిన్ వెళ్లారు. ఆ తర్వాత అటు నుంచి అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం భర్త నిక్‌ జోనాస్‌ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆమె చాలా దగ్గరగా పరిశీలించారు. ఎన్నికల ప్రారంభం నుంచి ఆమె తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎంపికైనప్పటి నుంచి ప్రియాంక తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ‘నల్లజాతి, దక్షిణాసియా మహిళలు.. అన్ని వర్ణాల మహిళలకు ఇది గర్వకారణం. ఈ పదవికి పోటీపడుతున్న మొదటి భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌కు అభినందనలు’ అని అప్పట్లో ప్రియాంక ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని