జయప్రకాశ్‌రెడ్డి.. తెలుగు ‘అలెగ్జాండర్‌’!

అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు...

Updated : 08 Sep 2020 14:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలెగ్జాండర్..ఈ పేరు చెప్పగానే విశ్వవిజేత కావాలన్న కోరికతో ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన గ్రీకు యుద్ధవీరుడు గుర్తుకొస్తాడు. కానీ, ఇదే పేరు తన పాత్రకి పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజమంతా ఏ చీకూచింతా లేకుండా ఉండాలని తాపత్రయపడిన ఓ తెలుగు నటుడి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనే జయప్రకాశ్‌ రెడ్డి. 100 నిమిషాల నాటకంలో ఏక పాత్రధారిగా, అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడంతోపాటు..నటన అంటే ఓ సామాజిక బాధ్యత అని చెప్పిన ఆయన ఆశయం చిరస్మరణీయం

అలాంటి పాత్ర అది..

అలెగ్జాండర్... ఓ మాజీ సైనికాధికారి కథ. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు దేశ సరిహద్దుల్లో పోరాడి, పదవీ విరమణ తర్వాత కూడా సమాజం బాగు కోసం తపన పడిన హృదయమది. తాను ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్నా, ఫోన్ ద్వారా తమ సమస్యలు చెప్పుకునే వారికి ఓ పెద్ద దిక్కులా మారి, వారిలో స్ఫూర్తిని రగిలించే ఓ తండ్రి తత్వమది. జీవితంలో ఎన్ని సమస్యలెదురైనా పోరాడాలి కానీ, పిరికితనంతో ప్రాణాలను బలి చేసుకోకూడదంటూ ఓ నటుడి అంతర్మథనం నుంచి పుట్టుకొచ్చిన పాత్ర అది. ఆ పాత్ర జయ ప్రకాష్ రెడ్డి విలక్షణ నటన ద్వారా తొలుత రంగస్థలం పైనా, ఆ తర్వాత వెండితెరపైన తన బాధ్యతను నెరవేర్చుకుంది.

తెరమీదకు తెచ్చినప్పటికీ..

సినిమాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ నాటకమంటే తనకున్న అమితమైన ఆసక్తి వల్ల ఒకే ఒక పాత్ర ఉండే ఈ ‘అలెగ్జాండర్’ కథ రాయమని జయప్రకాశ్ రెడ్డి రచయిత పూసలను కోరారు. ఆయన 100 నిముషాల నిడివి ఉండేలా కథను అందించారు. ఆ తర్వాత తనకు ఏమాత్ర ఖాళీ సమయం దొరికినా జయప్రకాశ్‌ ఈ నాటకాన్ని ప్రదర్శించేవారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 సార్లు ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శించారు.  ప్రజల్లో భవిష్యత్తులో నాటకాలపై మక్కువ తగ్గుతూ ఉండటంతో దాన్ని సినిమాగా చిత్రీకరించాలనుకున్నారు. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం సహాయంతో ‘అలెగ్జాండర్’ చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 

సినిమాలో కనిపించకపోయినా, ఆయనతో ఫోన్లో మాట్లాడే పాత్రలుగా కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్,  కొండవలస,  రావి కొండలరావు, సాయికుమార్, తెలంగాణ శకుంతల, రఘుబాబు ఇలా వీరంతా గాత్రాన్ని అందించారు. ఇంత చేసినప్పటికీ సినిమా విడుదలకు ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఓ సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైక పాత్రగా ఉన్న ఆ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు. తనను కాకుండా..ఆ కథలో తను చెప్పదలుచుకున్న సందేశాన్ని చూసేందుకు అయినా... ప్రేక్షకులు సినిమాని ఆదరించాలి అంటూ ఆయన ఎన్నో సార్లు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.. అయితే తాజాగా అందరికీ ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆ సినిమాను చేరువ చేయాలనే ప్రయత్నాలు జరుగుతుండగానే జయప్రకాశ్ రెడ్డి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని