‘ఆ దర్శకుడు నన్ను దుస్తులు తీయమన్నాడు..!’

బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై ప్రముఖ మోడల్‌ పాలా ఆరోపణలు చేశారు. తన 17 ఏళ్ల వయసులో ఆయన దారుణంగా ప్రవర్తించాడని అన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో ‘మీటూ’ ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముగ్గురు మహిళలు సాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ‘హౌస్‌ఫుల్‌ 4’......

Published : 11 Sep 2020 16:08 IST

సాజిద్‌ ఖాన్‌పై మోడల్‌ సంచలన వ్యాఖ్యలు

‘మీటూ’ సమయంలోనూ ఆయనపై ముగ్గురి ఆరోపణలు

ముంబయి: బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై ప్రముఖ మోడల్‌ పాలా ఆరోపణలు చేశారు. తన 17 ఏళ్ల వయసులో ఆయన దారుణంగా ప్రవర్తించాడన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లో ‘మీటూ’ ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముగ్గురు మహిళలు సాజిద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ‘హౌస్‌ఫుల్‌ 4’ నిర్మాతలు సాజిద్‌ను ప్రాజెక్టు నుంచి తప్పించి, మరొకర్ని తీసుకున్నారు. కాగా ఇన్నాళ్లకు ప్రముఖ మోడల్‌ పాలా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ప్రజాస్వామ్యం చనిపోవడానికి ముందు, భావాల్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను నిషేధించడానికి ముందే.. నాకు జరిగిన ఘోరాన్ని బయటపెట్టాలి అనిపించింది’ అని క్యాప్షన్‌ ఇస్తూ.. పోస్ట్‌ చేశారు.

‘మీటూ ఉద్యమ సమయంలో చాలా మంది అమ్మాయిలు సాజిద్‌ ఖాన్‌ వేధించాడని చెప్పారు. కానీ నేను చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే.. గాడ్‌ ఫాదర్‌ (సినీ నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ..) లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన నటుల్లో నేనూ ఒకదాన్ని. కుటుంబ సభ్యుల్ని పోషించడానికి డబ్బులు సంపాదించాల్సిన బాధ్యత నాపై ఉండటంతో మౌనంగా ఉన్నా. కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు నాతో లేరు. ఒకరిపై ఆధారపడకుండా.. నేనే స్వయంగా సంపాదిస్తున్నా. ‘నా 17 ఏళ్ల వయసులో సాజిద్‌ ఖాన్‌ నన్ను లైంగికంగా వేధించాడు’ అని చెప్పే ధైర్యం నాకు వచ్చింది’.

‘ఆయన నాతో చాలా అసహ్యంగా మాట్లాడారు. నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు తన సినిమా ‘హౌస్‌ఫుల్‌’లో నటించే అవకాశం ఇవ్వాలంటే.. తన ముందు దుస్తులు విప్పాలని అడిగాడు. ఆయన ఇంత దారుణంగా ఎంత మంది అమ్మాయిలతో ప్రవర్తించాడో ఆ దేవుడికే తెలియాలి. అందరి సానుభూతి కోసం నేను ఇప్పుడు ఈ విషయం చెప్పడం లేదు. నా చిన్నతంలోనే ఇలాంటి ఘటన ఎదర్కోవడం వల్ల మానసికంగా ఎంత కుంగిపోయానో తెలపడానికి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మారాను.. ఇలాంటి క్రూరులు ఊచలు లెక్కబెట్టాలి. కేవలం కాస్టింగ్‌ కౌచ్‌కు మాత్రమేకాదు.. ఇతరుల్ని మభ్యపెట్టి, వారి కలల్ని చిదిమేసినందుకు కూడా ఆయన శిక్ష అనుభవించాలి. కానీ నేను వేధింపుల తర్వాత నా లక్ష్యాణ్ని పక్కనపెట్టలేదు. ఆయన నిజస్వరూపాన్ని ఇన్నాళ్లూ బయటపెట్టకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు’ అని ఆమె పోస్టు‌లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని