Kamal Haasan: 50 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నాం: ‘ప్రాజెక్ట్‌ కె’పై కమల్‌ హాసన్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం.. ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Published : 25 Jun 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్‌ (Aswani Dutt) కెరీర్‌ ప్రారంభించిన దాదాపు 50 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయనుండడంపై అగ్ర నటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) ఆనందం వ్యక్తం చేశారు. అశ్వినీ దత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) (వర్కింగ్‌ టైటిల్‌)లో ఓ కీలక పాత్రకు ఎంపికైన ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

‘‘50 ఏళ్ల క్రితం నేను డ్యాన్స్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సినీ నిర్మాణంలో అశ్వినీ దత్‌ పేరు ప్రముఖంగా వినిపించేది. 50 సంవత్సరాల అనంతరం మేమిద్దరం కలిసి ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం పనిచేయబోతున్నాం. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కొత్తతరం దర్శకుడు. ప్రతిభావంతుడు. నా సహనటులు ప్రభాస్‌, దీపికా పదుకొణె కూడా అంతే. నేనూ అమితాబ్‌ బచ్చన్‌ ఇంతకు ముందే కలిసి పనిచేశాం. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది. సినిమా సినిమాకీ అమితాబ్‌ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు. నేనూ అదే బాటలో పయనిస్తుంటా. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకులు నాకు ఏ స్థానాన్ని కట్టబెట్టినా.. నేను సినిమా ప్రేమికుడిని. నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నమైనా మెచ్చుకుంటూనే ఉంటాను. ఈ సినిమా విషయంలో తొలి ప్రశంస నాదే. దేశం, ప్రపంచవ్యాప్త సినీ ప్రియులందరినీ నాగ్‌ అశ్విన్‌ విజన్‌ చప్పట్లు కొట్టేలా చేస్తుంది’’ అని కమల్‌ హాసన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మహానటి’ (Mahanati) తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ‘ప్రాజెక్ట్‌ కె’ను ప్రకటించారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) సహకారం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా నటుడు ప్రభాస్‌ని హీరోగా ప్రకటించిన క్షణం నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా దీపికా పదుకొణె (Deepika Padukone)ను, మరో ముఖ్య పాత్రకు అమితాబ్‌ (Amitabh Bachchan)ని తీసుకుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. దిశా పటానీ (Disha Patani) ఓ కీ రోల్‌ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ ఎంపికయ్యారంటూ టీమ్‌ వెల్లడించగానే యావత్‌ సినీ ప్రపంచం ‘ప్రాజెక్ట్‌ కె’పై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది.

28 ఏళ్ల తర్వాత తెలుగులో..

కమల్ హాసన్‌ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 28 ఏళ్లైంది. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’లోని అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేశారు. ‘వయసు పిలిచింది’, ‘సొమ్మొకడది సోకొకడిది’, ‘ఇది కథ కాదు’వంటి రీమేక్‌ చిత్రాలతో మెప్పించిన కమల్‌.. ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’వంటి స్ట్రైట్‌ మూవీస్‌తో విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన నేరుగా టాలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం.. ‘శుభ సంకల్పం’ (Subha Sankalpam) (1995). వరుస డబ్బింగ్‌ సినిమాలతో ఆయన తెలుగు ఆడియన్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. గతేడాది ‘విక్రమ్‌’ (Vikram)తో ఘన విజయం అందుకున్న కమల్‌.. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ (Indian 2)లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఇండియన్‌’ (భారతీయుడు)కి సీక్వెల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని