Actor Kartikeya: వలిమైకి అర్థమదే.. గాయమైనా అజిత్‌ సర్‌ చెప్పలేదు: కార్తికేయ

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌100’తో గుర్తింపు పొందారు యువ నటుడు కార్తీకేయ. ఓ పక్క హీరోగా రాణిస్తూనే నాని గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా మెరిశారు.

Published : 19 Feb 2022 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌100’తో గుర్తింపు పొందారు యువ నటుడు కార్తికేయ. ఓ పక్క హీరోగా రాణిస్తూనే నాని గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌గా మెరిశారు. ఫిబ్రవరి 24న విడుదల కాబోయే అజిత్‌ పాన్‌ఇండియా చిత్రం ‘వలిమై’లోనూ విలన్‌గా అలరించనున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ‘వలిమై’ అనుభవాలు, చిత్ర విశేషాలను కార్తికేయ విలేకర్లతో ఇలా పంచుకున్నారు.

అలా పిలుపు వచ్చింది...

2019లో దర్శకుడు హెచ్‌.వినోద్‌ నుంచి కాల్‌ వచ్చింది. అప్పటికే ఆయన దర్శకత్వం చేసిన ‘ఖాకీ’ చూశా. చాలా నచ్చింది. వినోద్‌ మాట్లాడుతూ.. ‘‘అజిత్‌తో సినిమా చేస్తున్నా. హీరో ఇమేజ్‌ ఉండి ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్‌ ఉండే విలన్‌ కావాలి. మీ ‘ఆర్‌ఎక్స్‌100’ చూశా. ఈ స్క్రిప్ట్‌కి మీరు బాగుంటారనిపిస్తోంది. మీరు చేస్తారా? అని ఆఫర్‌ చేశారు. కథ, పాత్ర గురించి చెప్పాక.. ‘గ్యాంగ్‌లీడర్‌’ కన్నా ఎక్కువ షేడ్స్‌ కనిపించాయి. అందులో సింగిల్‌ పాయింట్‌ ‘రేసర్‌’ అవ్వాలని ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా లోతు, పాత్ర పరంగా కూడా బాగుంటుంది. అందులోనూ అజిత్ సర్‌ పక్కన కాబట్టి విలన్‌ కూడా ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే తమిళ్‌లోనూ గుర్తింపు దక్కుతుంది. అజిత్‌ సర్ ఫ్యాన్స్‌ చూస్తారు. అందుకే ఒప్పుకున్నా.

వరుస పెట్టి వస్తున్నాయి..

ఆర్‌ఎక్స్‌100లో బైక్‌, గ్యాంగ్‌లీడర్‌లో కార్‌ రేసర్, వలిమైలో బైక్‌ రేసర్‌.. ఆ రేసర్‌, బైక్స్‌..అదేంటో ఇవే నాకు వరుసగా వస్తున్నాయి (నవ్వులు)

అజిత్‌ సర్‌ స్పెషాల్టీ అదే..!

‘‘ఫస్ట్ వర్క్‌ అనేది ఒక అవకాశంలానే భావించా. ఆయనతో పనిచేయడం ప్రారంభించాక ఆ అవకాశమనేది రెండో స్థానంలోకి వెళ్లింది. ప్రొఫెషనల్‌గా సెట్‌కి ఎప్పుడొచ్చినా షాట్‌ ఎప్పుడు పెట్టినా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. షూటింగ్‌ సమయంలో ఆయనకు పెద్ద గాయమైంది. ఆ సమయంలో నేనక్కడే ఉన్నా. పెద్ద దెబ్బ తగిలినా కూడా ఎవరికి చెప్పలేదు ‘ఎందుకు’ అని అడిగితే  నీ డేట్స్‌, ఫైట్‌ మాస్టర్‌‌, లొకేషన్ అన్నింటికీ ఇబ్బందవుతుంది. నేను ఒక్కరోజు ఓపికపడితే సరిపోతుంది’ అని అన్నారు. అంత పెద్ద స్టార్ అందరి గురించి ఆలోచించడం నచ్చింది. భవిష్యత్‌లో ఎంత సక్సెస్‌ అయినా ఫ్రొఫెషనల్‌  ఒకేలా ఉండాలని నేర్చుకున్నా’’

అదే ఓ సవాలు

‘‘వినోద్‌ సర్‌తో ఓ మాట అన్నా. ‘‘అజిత్‌  బైక్‌ రేసర్‌. ఆయనకు బైక్‌ ఇమేజ్‌ బాగా ఉంది. నా బైక్‌ రైడింగ్‌ స్కిల్స్‌ అన్నీ ఆర్‌ఎక్స్‌100 రేంజ్‌. అజిత్‌ సర్‌ రేంజ్‌ వేరు’’ అని అంటే ‘ఏం కాదు సేఫ్‌గా చేద్దాం’ అన్నారు. చెన్నైలో ఓసారి ఆ బైక్‌ ప్రాక్టీస్‌ చేసినప్పుడు సౌకర్యంగా అనిపించింది. అజిత్‌ సర్‌తో నడపడం మరో ఎత్తు. యాక్షన్‌ అని చెప్పగానే ఎక్కడో ఉంటారు. అది ఆయన స్పీడ్‌ రేంజ్‌. అది మ్యాచ్‌ చేయడం ఓ సవాలుగా మారింది. ఆయన కూడా నా స్పీడ్‌ని మ్యాచ్‌ చేస్తూ చేశారు. 80శాతం యాక్షన్‌ సీన్స్‌ మేమే చేశాం.  దాదాపు అన్ని షాట్స్‌ అజిత్‌ సర్‌ చేశారు’’

వలిమై అర్థమిదే..

వలిమై అనేది తమిళ్‌ పదం. వలిమై అంటే ఓ శక్తి. శారీరక శక్తి మాత్రమే కాదు.. మానసిక శక్తి కూడా. ఇలా రెండింటినీ కలుపుతూ తమిళ్‌లో ఓ పదం ఉంది. అదే ‘వలిమై’. లాజికల్‌గా చూస్తే తెలుగులో వేరే టైటిల్‌ పెట్టాలి. ఈలోపు అందరూ వలిమై అనే పదానికి అలవాటు కావడంతో అదే ఉంచేశాం. అందుకే బలం, పవర్‌ అనుకున్నా అదేదో డబ్బింగ్‌ సినిమాలా ఉందనిపించింది. (నవ్వులు)

హీరో, విలన్‌.. మధ్య తేడాలివే..

‘‘హీరో, విలన్‌.. కెమెరా ఆన్‌చేశాక చూసేది క్యారెక్టరే. ఇక విలన్‌ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేయొచ్చు. హీరో రోల్‌కి కొన్ని పరిమితులు ఉంటాయి. ‘వలిమై’లో సైకో లాంటి విలన్‌రోల్‌ అయితే ఇంకా ఎంజాయ్‌ చేయొచ్చు. హీరోలా చేస్తే మార్కెట్‌ పరంగా, నెంబర్స్‌ పరంగా కాస్త ఒత్తిడి ఉంటుంది. ప్రమోషన్స్‌తో పాటు వచ్చే ఫలితం.. ఇలా మన మీదే ఉంటాయి. విలన్‌ రోల్‌లో ఆ ఒత్తిడి రోల్‌ కాస్త తక్కువ ఉంటాయి. హిట్‌ అయ్యాక వచ్చే ప్రశంసలు ఎక్కువగా ఉంటాయి’’

ఆ చర్చలే ఎక్కువ

‘‘అజిత్‌ సర్‌ యాక్టింగ్ గురించే చర్చించేవారు. కేవలం కెమెరా ఆన్‌ ఉన్నప్పుడే యాక్టింగ్‌ ఉంటుంది.  ఆయనకు ఇష్టమైన టాపిక్స్‌.. కుకింగ్‌, బైక్‌ రేసింగ్‌, ఆయన సినిమాలు.. ఇవే మాట్లాడేవారు. మనకు తెలిసిన వాళ్లతో ఎలా మాట్లాడతామో ఆయనతోనూ చర్చలంటే అలానే ఉంటాయి’’

ఆశీర్వాదంగా భావిస్తా..

‘‘ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అవ్వడం  నా ఆశీర్వాదం. ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ ఊహించలేదు. కేవలం తమిళ చిత్రం, అజిత్‌, వినోద్‌ మాత్రమే అనుకున్నా. తెలుగులోనూ వస్తుందని తెలీదు. మామూలుగా అజిత్‌ సినిమాలంటే తమిళ్‌లో ఓ రేంజ్‌లో ఉంటాయి. ‘వలిమై’ ఇంకా హైప్‌కి వెళ్లింది. ఈ సినిమా ద్వారా తమిళ్‌, హిందీ, కన్నడలోనూ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా’’

కనెక్ట్‌ అవుతారు..

‘‘ఇది చాలా డిఫరెంట్‌ సినిమా. నేను చేసిన రోల్‌ కూడా ఈ కాలం యూత్‌కి ఉండే ఇబ్బందులేంటి అనే అంశం చుట్టూ నడుస్తుంది. ఇందులో ఉండే యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇటీవలి కాలంలో ఇండియన్‌ సినిమాల్లో చూడలేదు. సో ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది. మదర్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా తెలుగు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’’

ఇవే సవాళ్లు..

‘‘ఈ సినిమాకి ముందు తమిళ్‌ ఒక పదం రాదు. తర్వాత తమిళ్‌ నేర్చుకున్నా. భాష నేర్చుకుంటేనే కదా.. ఆ పాత్రలో లీనమై నటించగలం. అందుకే తమిళ్ సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నా. ప్రస్తుతానికి తమిళ్‌ అర్థమవుతుంది. కొంత మేరకు మాట్లాడగలుగుతున్నా. డబ్బింగ్‌ చెప్పాలని ప్రయత్నించా. అక్కడక్కడ గ్రాంథిక తమిళం ఉంటుంది. అందుకే వేరే వాళ్లతో డబ్‌ చేయించాం. యువన్‌ శంకర్‌ రాజా సంగీతానికి పెద్ద ఫ్యాన్స్‌ నేను. గ్యాంగ్‌లీడర్‌లో విలన్‌ ఎంట్రీ అప్పుడు అనిరుథ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎలా ఇచ్చారో ఇందులోనూ అలా ఉంటుంది. ఓ నటుడికి ప్రత్యేకంగా ఇచ్చే మ్యూజిక్‌ ఇంకో మెట్టుకు తీసుకెళ్తుంది. అందులో కెమెరామెన్‌, సంగీత దర్శకుడి పాత్ర ఉంటుంది.

భీమ్లా నాయక్‌ కోసం నేనూ ఎదురుచూస్తున్నా..

‘‘వలిమై మరుసటి రోజు పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ వస్తుందని తెలియదు. ముందే తెలిస్తే వలిమై వాయిదా వేయించే వాడిని. నిజానికి నేను భీమ్లా కోసం చాలా ఎదురుచూస్తున్నా’’

తదుపరి సినిమాలివే..

‘‘తెలుగులో యూవీ క్రియేషన్స్‌లో ప్రశాంత్‌ అనే కొత్త దర్శకుడుతో చేస్తున్నా. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీదేవీ మూవీస్‌ సినిమాలు చేస్తున్నా. ఈఏడాది ‘ఆర్‌ఎక్స్‌100’ డైరెక్టర్‌ అజయ్‌తో చేయాలని లవ్‌ యాక్షన్‌ సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇంకా ఖరారు కాలేదు. కెరీర్‌ ముందుకు తీసుకెళ్లే హీరో, విలన్‌ రోల్‌ ఏదైనా సరే! కచ్చితంగా చేస్తా’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని