Praveen: ప్రతీ శుక్రవారం ఒకరు వెలుగులోకొస్తారు!

‘‘కామెడీ అనే కాకుండా... రకరకాల పాత్రలు చేసి బహుముఖ నటుడు అనిపించుకోవాలనేదే నా ప్రయత్నం’’ అంటున్నారు హాస్యనటుడు ప్రవీణ్‌.

Updated : 23 Jun 2022 07:09 IST

‘‘కామెడీ అనే కాకుండా... రకరకాల పాత్రలు చేసి బహుముఖ నటుడు అనిపించుకోవాలనేదే నా ప్రయత్నం’’ అంటున్నారు హాస్యనటుడు ప్రవీణ్‌(Praveen). ‘కొత్తబంగారు లోకం’(Kothabangaru Lokam) నుంచి తనదైన టైమింగ్‌తో ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారాయన. ఇటీవల ‘పక్కా కమర్షియల్‌’లో(Pakka Commercial) నటించారు. గోపీచంద్‌(Gopichand) కథానాయకుడిగా...మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
దర్శకుడు మారుతితో ‘ప్రేమకథా చిత్రమ్‌’(Prema Katha Chitram) నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్వతహాగా ఆయన సరదాగా ఉండే వ్యక్తి. ఈవీవీ సినిమాల తరహాలో ఆయన చిత్రాల్లో ఎక్కువమంది హాస్యనటులు కనిపిస్తుంటారు. ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో హీరో గోపీచంద్‌ పక్కన జూనియర్‌ లాయర్‌గా కనిపిస్తా. మా చిన్నాన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. తన చుట్టూ వాతావరణం ఎలా ఉండేదో గమనించేవాణ్ని. దాంతో ఇందులో సులభంగా నటించా. గోపీచంద్‌తో ‘వాంటెడ్‌’, ‘మొగుడు’ సినిమాల్లో కలిసి పని చేశా. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇందులో కలిశాం. చిత్రీకరణ విరామంలో సినిమాల గురించి, ఓటీటీ వేదికల గురించి మాట్లాడుకునేవాళ్లం’’.

* ఎన్ని సినిమాలు చేసినా అవి ఆడితేనే నటులకి గుర్తింపు, అవకాశాలు. తొలి సినిమా ‘కొత్తబంగారులోకం’ చేస్తున్నప్పుడు ఎలా ఆడుతుందో అనే భయం ఉండేది.. కానీ, ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా నా శైలిలో నేను ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్లిపోతున్నా. పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉంది. ప్రతీ శుక్రవారం ఓ హాస్య నటుడు వెలుగులోకొస్తాడు. అయినా ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటే కారణం దర్శకులకి ఉన్న నమ్మకమే. కొన్ని సినిమాలు ఆడనప్పుడు మాత్రం నిరుత్సాహం కలుగుతుంది. కొన్నేళ్ల కిందట ‘రౌడీఫెలో’లో ప్రతినాయక ఛాయలున్న పాత్రని చేశా. దాని తర్వాత అలాంటి పాత్రలు వస్తాయని ఆశించా. కానీ అదేం జరగలేదు. కోట శ్రీనివాసరావు సర్‌ అన్ని రకాల పాత్రలు చేశారు. రమణారెడ్డి మొదలుకొని  హాస్యనటులు చాలా మంది నాకు స్ఫూర్తి. ఒకొక్కరిదీ ఒక్కో శైలి. ‘జబర్దస్త్‌’లో కొద్దిమంది నటుల టైమింగ్‌ కూడా నచ్చుతుంటుంది. ప్రస్తుతం ‘రావణాసురుడు’, ‘ధమాకా’, ‘మారేడుమిల్లి ప్రజానీకం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ చిత్రాలు చేస్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు