Sunil: నవ్వించే చిత్రాలే ఎక్కువ రావాలి

‘ ‘సీరియస్‌ పాత్రలు చేయడం కంటే కామెడీ చేయడమే చాలా కష్టం. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కామెడీ చిత్రాల సంఖ్య తగ్గింది. ఇది ఓ హాస్యనటుడిగా నాపై కన్నా ప్రేక్షకుల మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది’’ అన్నారు నటుడు సునీల్‌. కెరీర్‌ ఆరంభంలో హాస్యనటుడిగా నవ్వులు పంచిన ఆయన..

Updated : 15 May 2022 09:09 IST

‘ ‘సీరియస్‌ పాత్రలు చేయడం కంటే కామెడీ చేయడమే చాలా కష్టం. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కామెడీ చిత్రాల సంఖ్య తగ్గింది. ఇది ఓ హాస్యనటుడిగా నాపై కన్నా ప్రేక్షకుల మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది’’ అన్నారు నటుడు సునీల్‌. కెరీర్‌ ఆరంభంలో హాస్యనటుడిగా నవ్వులు పంచిన ఆయన.. తర్వాత హీరోగా మారి, పలు విజయవంతమైన చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఎఫ్‌3’తో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ‘ఎఫ్‌2’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాను అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. ఇది ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సునీల్‌.

నటుడిగా పాతికేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది?
‘‘చాలా వైవిధ్యమైన ప్రయాణమిది. ఎన్నో విభిన్న రకాల పాత్రలు పోషించా. హాస్య నటుడిగా నవ్వించా.. హీరోగా అవకాశమొస్తే చేశా.. ‘కలర్‌ఫొటో’, ‘పుష్ప’ల్లో ప్రతినాయకుడిగా నటించా.. ఇలా నేనేం చేసినా, చేయగలిగినా.. అది ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది’’.

‘‘ఎఫ్‌3’లోకి ఎలా వచ్చారు?
‘‘సరిలేరు నీకెవ్వరు’ టైమ్‌లో అనిల్‌ రావిపూడి నాకీ సినిమా గురించి చెప్పారు. వింటేజ్‌ సునీల్‌ని గుర్తుచేసేలా దీంట్లో ఎంతో చక్కగా నా పాత్రని తీర్చిదిద్దారు. ఇందులో పూర్తి నిడివి ఉన్న పాత్ర నాది. ఇందులో వెంకటేష్‌, రఘుబాబు ఒక బ్యాచ్‌. నేనూ, వరుణ్‌ ఒక బ్యాచ్‌. అలాగే రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, తమన్నా.. ఇలా ఎవరికి వారే బ్యాచ్‌లుగా ఉంటారు. ఈ అన్ని క్యారెక్టర్లు ఒక దగ్గరకు చేరగానే వినోదం రెట్టింపవుతుంది’’.

వరుణ్‌తేజ్‌లో బాగా నచ్చిన అంశం ఏంటి? వెంకటేష్‌ పాత్ర ఎలా ఉంటుంది?
‘‘వరుణ్‌ తేజ్‌ని చిన్నప్పటి నుంచి చూస్తేనే ఉన్నా. హాలీవుడ్‌, రష్యన్‌, యురోపియన్‌ సినిమాల్లోనూ నటించగల వ్యక్తిలా కనిపిస్తాడు. అలాంటి కటౌట్‌ తనకుంది. తనలో విపరీతమైన ఫన్‌, వెటకారం.. ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరూ వాటిని వెలికి తీయలేదు. ‘ఎఫ్‌3’తో ఆ ఫన్‌ యాంగిల్‌ మొత్తం బయటకొచ్చేసింది. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నుంచి వరుణ్‌కు మరిన్ని కామెడీ చిత్రాల్లో అవకాశాలొస్తాయి. ఇక వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’.

ఈ సినిమా విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
‘‘ప్రత్యేకంగా సవాళ్లంటూ ఏమీ లేవు కానీ, ‘పుష్ప’ టైమ్‌లో కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఓ వారం పాటు రాత్రిపూట ‘పుష్ప’లో.. పగలు ‘ఎఫ్‌3’లో చేయాల్సి వచ్చింది. ఆ రెండు క్యారెక్టర్లు వేటికవే పూర్తి భిన్నమైనవి. వాటి మీటర్లు చాలా వేరుగా ఉన్నాయి. అదొక్క సందర్భంలో తప్ప ఇంకెప్పుడూ నాకు సవాల్‌గా అనిపించలేదు’’.

గతంతో పోల్చితే ఇప్పుడు వినోదాత్మక చిత్రాలకు ఎలాంటి ఆదరణ ఉందనుకుంటున్నారు?
‘‘ఇప్పుడు టాలీవుడ్‌లో నలుగురైదుగురుకు మించి హాస్య దర్శకులు లేరు. అందుకే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు వినోదాత్మక సినిమాల సంఖ్య చాలా తగ్గింది. ఇది ప్రేక్షకుల్నే ఎక్కువ ప్రభావితం చేస్తోంది. నిజానికి నవ్వించే సినిమాలు చేయడం, కమెడియన్‌గా నవ్వించడం అంత తేలిక కాదు. సరదాగా నవ్వుతుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు కదా. కాబట్టి వినోదాత్మక చిత్రాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకుల్ని నవ్వించాలి. ప్రతి రోగానికి మందు నవ్వే. నేనూ అదే నమ్ముతా. అన్ని జానర్లు రావాలి కానీ, నవ్వించే చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటా’’.

అన్ని రకాల పాత్రలతో.. పరిపూర్ణ నటుడయ్యారని అనుకుంటున్నారా?
‘‘అలా ఏం లేదండి. ఇది మహా సముద్రం. కమల్‌ హాసన్‌ నాలుగు సినిమాలు చూస్తే చాలు. అందులో మనం ఇంకా చేయలేనివి వంద కనిపిస్తాయి. ఇప్పుడు విలక్షణ పాత్రలు చేసే అవకాశం దక్కుతోంది. ప్రస్తుతం నేను నా కెరీర్‌ను ప్లాన్‌ చేయడం మానేశాను. నా కోసం నేచర్‌ ఏం ప్లాన్‌ చేస్తుందో గుర్తిస్తున్నాను. నన్ను కామెడీ చేయమన్నా ఓకే. పదహారేళ్ల అమ్మాయికి తండ్రిగా చేయమన్నా ఓకే. వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వందశాతం కష్టపడతాను’’.

విలన్‌గా చేయాలన్న కోరికను ‘పుష్ప’ పూర్తి చేసిందని భావిస్తున్నారా?
‘‘అవును. ‘పుష్ప’ నాలోని మరో కోణాన్నిఆవిష్కరించింది. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర అది. ‘పుష్ప2’లోనూ నా పాత్ర కనిపిస్తుంది. ‘పుష్ప’ తర్వాత నుంచి తమిళం, కన్నడ, బాలీవుడ్‌ చిత్రాల్లో విలన్‌గా అవకాశాలొస్తున్నాయి. హిందీలో కొన్ని కామెడీ రోల్స్‌ వచ్చాయి. ప్రస్తుతానికి రెండు హిందీ చిత్రాలకు ఓకే చెప్పా. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా’’.

కొత్త సంగతులేంటి?
‘ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో నటిస్తున్నా. రామ్‌చరణ్‌ - శంకర్‌ల సినిమా చేస్తున్నా. మహేష్‌ - త్రివిక్రమ్‌ల చిత్రంలోనూ ఉంటాను. మరో 13 చిన్న, మీడియం రేంజ్‌ చిత్రాల్లో నటిస్తున్నా. హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా ప్రారంభిస్తా. నేను అందరికీ అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నా. ఏడాదికి ఓ నాలుగు పెద్ద సినిమాలు చేస్తే, మరో పది చిన్న చిత్రాలు చేస్తా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని