Updated : 29 Oct 2021 17:25 IST

romantic movie review: రొమాంటిక్‌ మూవీ రివ్యూ

చిత్రం: రొమాంటిక్; న‌టీన‌టులు: ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, ఉత్తేజ్‌, ర‌మాప్ర‌భ‌, దేవ‌యాని, మ‌క‌రంద్ దేశ్ పాండే త‌దిత‌రులు; సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌; ఛాయాగ్ర‌హ‌ణం: న‌రేష్ రానా; క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌; ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి; నిర్మాతలు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి; విడుద‌ల తేదీ: 29-10-2021

తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంతో మంది హీరోల‌ను స్టార్లుగా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఇప్పుడా స్టార్ల స‌ర‌స‌న త‌న త‌న‌యుడు ఆకాష్ పూరి(akash puri)ని కూడా నిల‌బెట్టాల‌న్న‌ది పూరి క‌ల‌. గ‌తంలో ‘మెహ‌బూబా’ చిత్రంతో ఆకాష్‌ను మంచి మాస్ హీరోగా తెర‌కు ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు పూరి. అది ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అందుకే ఈసారి యువ‌త‌రం మెచ్చేలా ఓ చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌తో ఆకాష్‌ను ‘రొమాంటిక్‌’(Romantic) గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. దీనికి పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌కున్నా.. క‌థ అందించ‌డంతో పాటు స్వ‌యంగా నిర్మించారు. ఈ సినిమాతోనే కేతిక శ‌ర్మను క‌థానాయిక‌గా.. అనిల్ పాదూరిని ద‌ర్శ‌కుడిగా తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ప్రచార చిత్రాలు, పాట‌లు ఆక‌ట్టుకునేలా ఉండ‌టంతో.. ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి అగ్ర‌తార‌లు దీన్ని ప్ర‌మోట్ చేయ‌డంతో సినీ ప్రియుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ఈ చిత్రంతో పూరి త‌న‌యుడికి విజయం దక్కిందా?(romantic movie review) ప్రేక్ష‌కుల అంచ‌నాల్ని ఈ సినిమా అందుకుందా?

క‌థేంటంటే: వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఓ అనాథ‌. త‌న లాంటి అనాథ‌ల కోసం ఇళ్లు క‌ట్టించాల‌ని చిన్న‌ప్పుడే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే డ‌బ్బు సంపాద‌న కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడ‌తాడు. గోవాలో డ్రగ్స్ స్మ‌గ్లింగ్ విష‌యంలో రెండు ముఠాల మ‌ధ్య అధిప‌త్య పోరు న‌డుస్తుంటుంది. వాస్కోడిగామా ఓ ముఠాలో చేరి.. అన‌తి కాలంలోనే ఆ ముఠా నాయ‌కుడిగా ఎదుగుతాడు.  ఇదే స‌మ‌యంలో గోవా పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార‌తాడు. అయితే అత‌ని జోరును ఆప‌డానికి ఏసీపీ ర‌మ్య గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌)ను రంగంలోకి దించుతుంది ప్ర‌భుత్వం. వాస్కోని, అత‌ని గ్యాంగ్‌ను అంతం చేయ‌డ‌మే ఆమె లక్ష్యం. గోవార్క‌ర్ రంగంలోకి దిగాక‌.. వాస్కో ల‌క్ష్య సాధ‌న‌కు అనేక స‌వాళ్లెదుర‌వుతాయి. ఈ క్ర‌మంలోనే మౌనిక (కేతిక శ‌ర్మ‌)(ketika sharma)తో వాస్కో సాగిస్తున్న‌ రొమాంటిక్ ప్ర‌యాణంలోనూ ఇబ్బందులెదుర‌వుతాయి. మ‌రి వాటిని వాస్కోడిగామా ఎలా ఎదుర్కొన్నాడు? ఏసీపీ ర‌మ్య‌కు వాస్కో చిక్కాడా?మౌనిక‌తో అత‌నికున్న రొమాంటిక్(Romantic) బంధం ఏంటి? అది ప్రేమా? లేక త‌ను న‌మ్మే మోహ‌మా? అన్న‌ది తెర‌పై చూడాలి.

ఎలా సాగిందంటే:  గోవా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. నిజానికి పైన చెప్పుకున్న క‌థ సినిమాలో ఓ చిన్న లైన్‌గానే క‌నిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న యాక్ష‌న్, రొమాంటిక్(Romantic) హంగామానే అస‌లు క‌థాంశం. దాన్ని పూరి త‌న‌దైన శైలిలో అనిల్ పాదూరితో ఎలా ఆవిష్కరింప‌జేశాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. నిజానికి  పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల్లో క‌థ‌ల‌న్నీ ఇంచుమించు ఇలాగే సాగుతుంటాయి. క్లాస్‌, మాస్ మెచ్చేలా కాస్తంత యాక్ష‌న్ హంగామా.. చ‌మక్కుమ‌నే సంభాష‌ణ‌లు.. ఆఖ‌ర్లో ఓ చిన్న ట్విస్ట్‌. అది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందా.. హిట్టు.. లేదంటే ఫ‌ట్టు.  ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’, ‘హార్ట్ ఎటాక్’ వంటి సినిమాల‌న్నీ ఈ త‌ర‌హాలో సాగిన‌వే. ఇప్పుడాయ‌న నుంచి వ‌చ్చిన ‘రొమాంటిక్’ కూడా ఇంచు మించు ఇదే మీట‌ర్‌లో సాగుతుంది. ఇంకా క‌చ్చితంగా చెప్పాలంటే ఇది పై మూడు సినిమాల‌ను మిక్స్ చేసి బ‌య‌ట‌కు తీసిన క‌థ‌లా అనిపిస్తుంటుంది.

ప్ర‌థమార్ధంలో వాస్కోడిగామాగా ఆకాష్‌ను ప‌రిచ‌యం చేసిన తీరు.. డ్ర‌గ్స్ దందాలో అత‌ను గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగిన వైనం అన్నీ ‘బిజినెస్‌మెన్’ చిత్రాన్ని త‌ల‌పించేలా ఉంటాయి.  మోహం పేరుతో వాస్కో.. మౌనిక వెంట ప‌డే స‌న్నివేశాలు, ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ ఎపిసోడ్‌లు యువ‌త‌రాన్ని ఆకర్షిస్తాయి. ర‌మ్య గోవార్క‌ర్ పాత్ర తెర‌పైకి వ‌చ్చాక.. క‌థ‌లో కాస్త వేగం పెరుగుతుంది. అయితే కుదిరితే యాక్ష‌న్.. లేదంటే రొమాన్స్.. రెండూ కాదంటే ఓ పాట‌ అన్న‌ట్లుగా సాగే ప్రథమార్ధం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంటుంది. ద్వితీయార్ధంలోనైనా పూరి శైలి మెరుపులు ఏమ‌న్నా క‌నిపిస్తాయ‌నుకుంటే.. అక్క‌డా ప్రేక్ష‌కుల‌కు నిరాశే ఎదుర‌వుతుంది. వాస్కోడిగామాను ప‌ట్టుకునేందుకు ర‌మ్య గోవార్క‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు చాలా చ‌ప్ప‌గా సాగుతాయి. ప‌దే ప‌దే హీరోయిన్‌ను అడ్డు పెట్టుకుని హీరోను ప‌ట్టుకోవాల‌నుకోవ‌డం.. ఆ ప్ర‌య‌త్నాలు మ‌రీ సిల్లీగా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఏ ఎపిసోడ్‌తోనూ క‌నెక్ట్ అయ్యే పరిస్థితి కనిపించదు. ప‌తాక స‌న్నివేశాల్ని భావోద్వేగ‌భ‌రితంగా తీర్చిదిద్దిన తీరు.. విషాదాంత‌పు ముగింపు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: న‌టుడిగా ఆకాష్ పూరి(akash puri)లో ప‌రిణ‌తి క‌నిపించింది. వాస్కోడిగామా క్యారెక్ట‌రైజేష‌న్‌ను చ‌క్క‌గా అర్థం చేసుకుని.. ఆ పాత్ర‌కు న్యాయం చేసే ప్ర‌యత్నం చేశాడు. ప‌తాక స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న అంద‌రినీ క‌ట్టిప‌డేస్తుంది. అయితే ఇలాంటి బ‌రువైన క‌థ‌ల‌కు త‌ను కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిద‌నిపిస్తుంది. కేతిక శ‌ర్మ(ketika sharma) తెర‌పై చాలా అందంగా క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా చూపించ‌డానికి పెద్ద‌గా ఆస్కారం దొర‌క‌లేదు.  రొమాంటిక్(Romantic) స‌న్నివేశాల్లో మాత్రం చెల‌రేగిపోయింది. ర‌మ్య గోవార్క‌ర్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఆమె పాత్రే సినిమాకి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌. మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్రను స‌రైన రీతిలో వాడుకోలేద‌నిపిస్తుంది. ఉత్తేజ్‌, ర‌మాప్ర‌భా త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకుంటాయి. క‌థ‌ను ఆసక్తిక‌రంగా తీర్చిదిద్దుకోక‌పోవ‌డ‌మే.. ఈ సినిమాకి ప్ర‌ధాన లోపం.  సినిమా ఏ ద‌శ‌లోనూ లాజిక్‌ల‌కు అంద‌దు. సంభాష‌ణ‌ల్లో మాత్రం త‌న క‌లం బ‌లం చూపించారు. అనిల్ పాదూరి త‌న‌కిచ్చిన క‌థ‌ను ఇచ్చినట్లుగా చూపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. పూరి శైలిని అందిపుచ్చుకోవ‌డంలో విజ‌యం సాధించాడ‌నిపిస్తుంది.  సునీల్ క‌శ్య‌ప్ సంగీతం, న‌రేష్ రానా ఛాయాగ్ర‌హ‌ణం పర్వాలేద‌నిపిస్తాయి.

బ‌లాలు

+ ఆకాష్, ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌

+ కేతిక శ‌ర్మ గ్లామ‌ర్‌

+ సంభాష‌ణ‌లు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌, స్క్రీన్ ప్లే

- ద్వితీయార్ధం

చివ‌రిగా: కుర్ర‌కారుకే ఈ ‘రొమాంటిక్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని