Amitabh Bachchan: అమితాబ్‌ ఇచ్చిన ఐడియా.. 12వేల మంది వస్తారనుకుంటే లక్షమంది వచ్చారు!

అమితాబ్‌ నటించిన ‘యారానా’ సినిమాలో  ‘సారా జమానా’ పాట వెనుక సంగతులను తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పంచుకున్నారు.

Published : 21 Sep 2023 18:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘమైన కెరీర్‌ కలిగిన నటుడు అమితాబ్‌బచ్చన్‌ (Amitabh Bachchan). ఆరు పదుల సినీ కెరీర్‌లో ఆయన చూడని ఎత్తు పల్లాలు లేవు. పలు విభిన్న పాత్రల పోషించడమే కాదు, తనదైన శైలిలో డ్యాన్స్‌లు వేసి ప్రేక్షకులను రంజింపచేశారు. అమితాబ్‌ కథానాయకుడిగా 1981లో వచ్చిన చిత్రం ‘యారానా’. ఈ సినిమాలో ‘సారా జమానా’ అనే సాంగ్‌లో అమితాబ్‌ బల్బులు కలిగిన డ్రెస్‌ ధరించి అలరించారు. అప్పట్లో ఈ పాట, డ్రెస్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. దీని వెనుకున్న స్టోరీని అమితాబ్‌ తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో పంచుకున్నారు.

‘‘ఆ దుస్తుల ఆలోచన నాదే. అయితే, అందుకు తర్వాత పశ్చాత్తాపపడ్డా. బల్బులతో కూడిన డ్రెస్‌ను డిజైన్‌ చేయమని డిజైనర్‌కు చెప్పాను. అంతేకాదు, నేను డ్యాన్స్‌ చేసేటప్పుడు అవి వెలుగుతూ ఉండాలన్నాను. అందుకు తగినట్లుగానే అతడు డిజైన్‌ చేసి తీసుకొచ్చాడు. ‘ఇవి ఎలా వెలుగుతాయి’ అని అతడిని అడిగా. ‘ఈ బల్బులన్నీ ఒకదానితో ఒకటి అటాచ్‌ అయి ఉన్నాయి. వీటన్నింటినీ కలిపిన వైరు తీసుకెళ్లి ప్లగ్‌లో పెడతా. అప్పుడు వెలుగుతాయి’ అన్నాడు. సినిమాలో మీరు చూసిన స్టెప్‌లు నేను వేసినవు కావు. నా ఒంట్లోకి కరెంట్‌ పాసై అలా వచ్చేశాయి’’ అంటూ అమితాబ్‌ చిరునవ్వులు చిందిస్తూ అప్పటి విషయాలను పంచుకున్నారు.

అంతేకాదు, ఈ పాట చిత్రీకరణను కోల్‌కతాలోని ‘నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌’ ఇండోర్‌ స్టేడియంలో షూట్‌ చేద్దామని నిర్మాతకు తానే సూచించినట్లు అమితాబ్‌ చెప్పారు. ‘‘ఆ స్టేడియం సామర్థ్యం 12వేలు. కానీ, సినిమాలో దాదాపు 50వేల మంది కనపడతారు. నేను ఈ ఆలోచన చెప్పినప్పుడు, ‘అంతమందిని ఎలా తీసుకురావాలి’ అని నిర్మాత అడిగారు. ‘మీరు ఏమీ చేయనవసరం లేదు. ఫలానా స్టేడియంలో అమితాబ్‌ షూటింగ్‌. అందరూ రావచ్చు’ అన్న వార్తను ప్రచారం చేయమని చెప్పా. 12వేల మంది వస్తారనుకుంటే దాదాపు 50వేల మంది వరకూ వచ్చారు. మరో 50వేల మంది వరకూ స్టేడియం బయట ఉండిపోయారు’’ అని అమితాబ్‌ ఆనాటి సంగతులు పంచుకున్నారు. ఈ సినిమా విడుదలైన మరుసటి ఏడాది ‘కూలి’ షూటింగ్‌లో భాగంగా అమితాబ్‌ తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అభిమానుల ప్రేమ, వారి ప్రార్థనల వల్లే తాను బతికానని ఇప్పటికే పలు వేదికలపై పంచుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని