ఇంగ్లీష్‌ మూవీ కథతో అమితాబ్‌ సినిమా.. వర్మ సలహాతో ‘బుడ్డా’ తీసిన పూరి!

అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘బుడ్డా’. 

Published : 14 Aug 2023 09:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘బుడ్డా’. 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. దర్శకుడు రాంగోపాల్‌వర్మ కారణంగా అవకాశం దక్కించుకున్న పూరి, తొలుత ఓ ఇంగ్లీష్‌ మూవీ కథతో అమితాబ్‌ కీలక పాత్రలో సినిమా చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పూరి పంచుకున్నారు.

చిన్నప్పటి నుంచి అమితాబ్‌కు పూరి జగన్నాథ్‌ వీరాభిమాని. ఆయనతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలన్నది పూరి కల. ఓ ఇంగ్లీష్ మూవీ చూస్తుండగా, వచ్చిన ఆలోచన ఆధారంగా అమితాబ్‌తో మూవీ చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు రాంగోపాల్‌వర్మకు చెబితే, ‘ఇంగ్లీష్‌ మూవీని చూసి ఎందుకు తీయాలి? నువ్వు సొంతంగా కథ రాయలేవా?’ అన్నారు. దీంతో వారం రోజుల్లో కథ రాసి, వర్మకు చెబితే, ఆయన ఆ కథ వినకుండానే అమితాబ్‌కు ఫోన్‌ చేసి, ‘మీకోసం పూరి జగన్నాథ్‌ కథ రెడీ చేశాడు. చాలా బాగుంది. ఒకసారి వినండి’ అన్నారు. దీంతో ముంబయి వెళ్లిన పూరి.. వర్మతో కలిసి అమితాబ్‌ ఇంటికి వెళ్లారు.

‘వర్మ ఉంటే నేను కథ చెప్పలేను’ అని పూరి అనడంతో అమితాబ్‌ వర్మను బయటకు పంపారు. దాదాపు గంటసేపు కథ చెప్పిన తర్వాత అమితాబ్‌కు నచ్చింది. వర్మను పిలిచి ఏవో ప్రశ్నలు అడుగడటం మొదలు పెట్టారు. వెంటనే వర్మ అందుకుని ‘‘సర్కార్‌’ (వర్మ దర్శకత్వంలో అమితాబ్‌ నటించిన చిత్రం. ఆ మూవీ దగ్గరి నుంచి ఆయన్ను అలాగే పిలుస్తున్నారట) మీరు వంద సినిమాలు చేయొచ్చు. నేనూ వంద తీయొచ్చు. పూరి మీ అభిమాని. మీతో సినిమా చేయాలన్నది అతడి కల. ప్రతి దానికీ ఎందుకు డౌట్స్‌. ఒకవేళ ఈ సినిమా పోయిందనుకుందాం. అమితాబ్‌ బచ్చన్‌ ఏమైనా పడిపోతాడా? ఒకవేళ హిట్‌ అయితే.. ఇంతకన్నా పెద్ద రేంజ్‌కు వెళ్లిపోతాడా? చిన్న పిల్లాడిని పట్టుకుని, ప్రశ్నలు వేయకండి సర్కార్‌.. ఐ హేట్‌ యూ’’ అని చెప్పి, పూరి జగన్నాథ్‌ను తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అమితాబ్‌ ఆ సినిమా చేయడం అభిమానులకు నచ్చడం జరిగిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని