Katakatala Rudrayya: రూ.18లక్షలతో తీస్తే రూ.75లక్షలు వచ్చాయి!

దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు (Krishnam Raju) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కటకటాల రుద్రయ్య’ (Katakatala Rudrayya). ఈ సినిమాలో కృష్ణ నటించాల్సి ఉండగా, చివరిగా ఆ పాత్ర కృష్ణంరాజును వరించింది.

Published : 28 Jul 2023 16:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు (Krishnam Raju) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కటకటాల రుద్రయ్య’ (Katakatala Rudrayya). విజయ మాధవి సంస్థలో తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘పాడవోయి భారతీయుడా’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నిర్మాత వడ్డే రమేశ్‌కు మంచి హిట్ ఇవ్వాలనే కసితో దాసరి ఈ మూవీ చేశారు. అప్పట్లో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ‘కటకటాల రుద్రయ్య’ ఒక ట్రెండ్ సెట్టర్. రూ.18 లక్షల బడ్జెట్‌తో తీస్తే, 1978 అక్టోబర్ 11న విడుదలైన ‘కటకటాల రుద్రయ్య’ దాదాపు రూ.75లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్ల గురించి విన్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ నిర్మాతలను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు.

కృష్ణతో అనుకుంటే..

‘కటకటాల రుద్రయ్య’ సినిమాకు మొదట అనుకున్న హీరో కృష్ణంరాజు కాదు, కృష్ణ. దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చడంతో హీరో కృష్ణ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు హీరో కృష్ణ నిర్మాత వడ్డే రమేశ్‌కు కబురు చేసి, ‘మీకు ఇచ్చిన డేట్స్‌ సమయంలోనే నేను మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పని చేద్దాం.. ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకూ మీ సినిమాకు పనిచేస్తా. వేరే వాళ్లకు ఒకటి నుంచి రాత్రి 9గంటల వరకూ షూటింగ్‌ చేస్తా. మీకు ఓకేనా’ అని అడిగారు. అందుకు వడ్డే రమేశ్ దానికి అంగీకరించలేదు. ‘అలా కుదరకపోవచ్చు. మీ డేట్స్ ఆ నిర్మాతకు ఇచ్చేయండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటా’ అని చెప్పి వచ్చేశారు వడ్డే రమేశ్. ఆ దారిలో హీరో కృష్ణంరాజు ఇల్లు ఉంటే సరాసరి అక్కడికి వెళ్లారు. ఆయన, కృష్ణంరాజు మంచి స్నేహితులు. ‘నా కటకటాల రుద్రయ్య చిత్రంలో హీరోవి నువ్వే’ అని చెప్పి అక్కడి నుంచి దాసరి ఇంటికి తీసుకెళ్లారు. విషయమంతా ఆయనకు వివరించారు. దాసరి కూడా సముఖత వ్యక్తం చేయడంతో హీరో కృష్ణ చేయాల్సిన పాత్ర ఇలా కృష్ణంరాజుకు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని