pathala bhairavi: ఎన్టీఆర్‌ను వరించిన ‘పాతాళభైరవి’

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో కలికితురాయిలాంటి చిత్రాల్లో ‘పాతాళ భైరవి’ (Pathala Bhairavi) ఒకటి. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌లు పోటీ పడి మరీ నటించారు.

Published : 19 Aug 2023 15:27 IST

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో కలికితురాయిలాంటి చిత్రాల్లో ‘పాతాళ భైరవి’ (Pathala Bhairavi) ఒకటి. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌లు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారి (మాలతి)ని ప్రేమించిన తోటరాముడు (ఎన్టీఆర్‌) సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుడి(ఎస్వీ రంగారావు)ని ఆశ్రయిస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. అయితే ఈ చిత్రంలో తోటరాముడి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను తీసుకుందామనుకున్నారట దర్శకుడు కె.వి.రెడ్డి. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రాంగణంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌‌ టెన్నిస్‌ ఆడుతుంటే దర్శకుడు కె.వి.రెడ్డి అక్కడికి వచ్చారు. ఇద్దరు హీరోలూ లీనమై ఆడుతున్నారు. రెండు మూడు బంతులు రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చి ఆ తర్వాతి బంతిని రెండు చేతులతో బలంగా బాదారట. ఆ బంతి ఎవరికీ కనిపించకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్‌ రాకెట్‌ను పట్టుకున్న విధానం దర్శకుడు కె.వి.రెడ్డికి బాగా నచ్చడంతో తోటరాముడి పాత్రకు ఆయనను ఎంపిక చేశారు.

అయితే అప్పట్లో సినిమాలకు డూప్‌లు ఉండేవారు కారు. సినిమా ఆరంభంలో ఎన్టీఆర్‌, బాలకృష్ణ కర్ర యుద్ధం చేసే సమయంలోనూ, మాయామహల్‌లో ఎస్వీఆర్‌తో ఎన్టీఆర్‌ ఫైట్‌ చేసే సన్నివేశాల్లో ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గం.కి ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఇసుక కోర్టులో ఫైట్స్‌ సాధన చేసేవారు. ఒక సహాయకుడు మాత్రం వారికి సూచనలు చేస్తూ ఉండేవాడు. ఈ మొత్తం తతంగాన్ని తాతినేని ప్రకాశరావు పర్యవేక్షించేవారు. ఉదయం బాగా అలసిపోయే వరకూ సాధన చేస్తూ ఉండేవాళ్లు. ఆ తర్వాత వారికి రెండు ఇడ్లీ, ఒక వడా ఇచ్చేవారు. అయితే ఎక్కువగా అలసిపోవడం వల్ల ఆ టిఫిన్‌ చాలదని ఎన్టీఆర్‌, ప్రకాశరావు అనడంతో రెట్టింపు టిఫిన్‌ పెట్టేవారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ అందుకున్న పారితోషికం రూ.250. విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ముందే ఒప్పందం జరిగిపోయింది. 1951 మార్చి 15న 13 ప్రింట్లతో ‘పాతాళ భైరవి’ విడుదలైంది. మంచి టాక్‌ రావడంతో ఆ తర్వాత 60 ప్రింట్‌లకు పెరిగింది. 10 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది. అప్పట్లో ఇదీ ఓ రికార్డే. మార్కస్‌ బార్‌ట్లే ఛాయాగ్రహణం, ఘంటసాల సంగీతం, గోఖలే-కళాధర్‌ల కళా దర్శకత్వం సినిమాకు నిండుదనాన్ని తెచ్చాయి.

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని